రాష్ట్రంలో పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపకశాఖల్లో మొత్తం 17,516 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా.. 7,33,559 అభ్యర్థులు మొత్తంగా 12,91,006 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా 51% దరఖాస్తులు బీసీ వర్గాల నుంచి రావడం విశేషం. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి 41% దరఖాస్తులు రాగా, ఓసీ సామాజిక వర్గం నుంచి 7.65% దరఖాస్తులు వచ్చాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే.. యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల పట్ల అగ్రవర్ణాలతో పోలిస్తే బడుగు, బలహీనవర్గాలు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడవుతోంది.
వివిధ విభాగాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దరఖాస్తుల గడువు మే 26తో ముగిసింది. 52 శాతం (3,55,679) మంది ఒకే ఒక్క ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. 29 శాతం మంది రెండు ఉద్యోగాలకు, 15 శాతం మంది మూడింటికి, 3 శాతం మంది నాలుగు ఉద్యోగాలకు, ఒక శాతం మంది ఐదు పోస్టులకు దరఖాస్తు చేయగా, 6 పోస్టులకు ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 21 శాతం (2,76,311) మహిళా అభ్యర్థుల నుంచి వచ్చాయని వెల్లడించారు. కాగా, ప్రభుత్వం నోటిఫికేషన్ సమయంలో ఇచ్చిన మూడేళ్లు కాకుండా మరో రెండేళ్ల వయోసడలింపుతో 1.4 లక్షల మంది అభ్యర్థులకు ఉద్యోగ పోటీలో అవకాశం దక్కింది. అలాగే ప్రిలిమినరీ రాతపరీక్షకు 67 శాతం మంది తెలుగు మీడియం, 32.8శాతం మంది ఆంగ్లం, 0.2శాతం మంది ఉర్దూ మీడియం ఎంచుకున్నారు.
ఇక.. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల నుంచి 3.48% దరఖాస్తులు వచ్చాయి. మహిళా అభ్యర్థుల నుంచి 2,76,311 దరఖాస్తులు (21%) రావడం మరో విశేషం. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసే తుది గడువు ముగిసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
పోస్టులవారీగా దరఖాస్తులిలా..
ఆ ఐదు జిల్లాలు టాప్..
పోలీస్ ఉద్యోగాల కోసం అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో ఆ ఐదు జిల్లాల నుంచే 33% ఉండటం గమనార్హం. అతి తక్కువగా ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి వచ్చాయి. ఈ జిల్లాలన్నీ కలిపి మొత్తం దరఖాస్తుల్లో కేవలం 7% మాత్రమే ఉన్నట్టు టీఎస్ పీఎస్సీ బోర్డు వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
ఎస్సై, తత్సమాన ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షను ఆగస్టు 7న (ఆదివారం) నిర్వహించేందుకు టీఎస్‌ఎల్పీఆర్బీ ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆగస్టు 21న(ఆదివారం)ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, కచ్చితమైన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.