తెలంగాణలో నిర్వహిస్తున్న పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫిజికల్ ఈవెంట్స్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారం వ్యవధిలో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. రన్నింగ్, లాంగ్ జంప్, షాట్‌ఫుట్ టార్గెట్ పెంచడం.. ఈవెంట్- ఈవెంట్ కి మరొక మధ్య రెస్ట్ తీసుకునేందుకు గ్యాప్ ఎక్కువగా ఇవ్వకపోవడం యువత ప్రాణాల మీదికి తెస్తోంది. మూడు రోజుల క్రితం ములుగు జిల్లా పందికుంట శివారు తండాకు చెందిన బనోత్ రాజేందర్ (27) అనే యువకుడు 1600 మీటర్ల రన్నింగ్ పూర్తి చేస్తూ కార్డియాక్ అరెస్ట్‌తో కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మరువక ముందే మరొక యువకుడు ప్రాణాలు విడిచాడు.
పోలీస్ కావాలన్న కలే యువకుల ప్రాణాలు తీస్తోంది. చేతికందివచ్చిన కొడుకు ఖాకీ డ్రెస్ లో ఇంటికి తిరిగొస్తాడని ఎదురుచూస్తోన్న తలిదండ్రులుకు.. ఆ కొడుకు లేడనే విషాదవార్త వారికి చేరుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంకు చెందిన లింగమల్ల మహేష్ (29) రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డి క్రీడాకారుడు. పలు పోటిల్లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ క్రమంలో రాష్ట్రంలో భారీగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడటంతో.. ఎలాగయినా ఉద్యోగాన్ని పొందాలన్న పట్టుదలతో హైదరాబాద్ కు వచ్చి.. కోచింగ్ తీసుకుని ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణడయ్యాడు. దీంతో ఈవెంట్స్ కోసం ఇక్కడే ఉంటూ బాగా సాధన చేశాడు. శనివారం అంబర్ పేటలోని సిసిఎల్ గ్రౌండ్ లో ఈవెంట్స్ లో పాల్గొన్న మహేష్, 1600 మీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నాడు. నిర్ణీత సమయానికి పరుగును పూర్తిచేసి తదుపరి ఈవెంట్స్ కు అర్హత సాధించాడు. వెంటనే ఛాతీలో నొప్పి రావడంతో ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే పోలీస్ అధికారులు అతన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో మహేష్ ప్రాణాలు కోల్పోయాడు.
గతంలో పోలీస్ ఉద్యోగాలకు ఐదు ఈవెంట్స్ ఉండేవి. 800 మీటర్లు, 100 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ ఫుట్ నిర్వహించేవారు. వీటిలో మూడు క్వాలిఫై అయితే మెయిన్స్‌కు అర్హులుగా ప్రకటించేవాళ్లు. ఈసారి ఆ సంఖ్యను మూడుకు తగ్గించారు. గతంలో ఉన్న 100 మీటర్ల రన్నింగ్‌తో పాటు హైజంప్ తొలగించారు. అలాగే.. 800 మీటర్ల రన్నింగ్ స్థానంలో 1,600 మీటర్లను తీసుకొచ్చారు. 7.15 నిమిషాల్లో ఈ టార్గెట్ పూర్తి చేయాలి. గతంలో లాంగ్ జంప్ 3.8 మీటర్లు ఉండగా, ఇప్పుడు దాన్ని 4 మీటర్లకు పెంచారు. షాట్ పుట్ 5.8 మీటర్లు ఉండగా 6 మీటర్లకు పెంచారు. ఈ మూడు తప్పక క్వాలిఫై కావాలనే రూల్ తెచ్చారు. 1,600 మీటర్ల పరుగు పందెంను నిర్దేశిత టైంలోగా పూర్తి చేసిన అభ్యర్థులు.. 15 నిమిషాల్లోగా లాంగ్ జంప్‌కు రెడీ అవ్వాలి.
ఇలా ఈవెంట్- ఈవెంట్ కి మరొక మధ్య గ్యాప్ ఎక్కువగా లేకపోవడం, మూడు క్వాలిఫై అవ్వాలనే నిబంధన యువతను ఒత్తిడికి గురిచేస్తున్నది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదనే ఆందోళనతో ఈవెంట్స్‌ను అటెంప్ట్ చేసి అస్వస్థతకు లోనై మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 17న వరంగల్‌లో నిర్వహించిన పరుగు పందెంలో రాజేందర్ (25) అనే యువకుడు ఈవెంట్స్ లో అర్హత సాధించి అస్వస్థతకు గురై చనిపోయాడు. అలాగే.. యాదాద్రి జిల్లా వంగపల్లికి చెందిన ముడుగుల సతీశ్ (30).. ఈనెల 19న నల్గొండలో నిర్వహించిన ఈవెంట్స్‌లో పాల్గొని గురై చనిపోయాడు.