జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ముగ్గురు యువకులు రెక్కీ నిర్వహించారని, వారిపై పార్టీ నేతలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ హత్యకు కుట్ర పన్నుతున్నారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హత్యకు రూ. 250 కోట్ల డీల్ కుదుర్చుకున్నారని కథనాలు కూడా ప్రచారం చేశారు. దీనిపై వైసీపీ పార్టీ కూడా స్పందించింది. పవన్ హత్య కుట్రపై వైసీపీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. వైసీపీ పార్టీకి ఎవరిపైనా రెక్కీ నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారు. అసలు రెక్కీ జరిగిందో లేదో తెలంగాణ పోలీసులు తేలుస్తారని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.
ఆయన అన్నట్టుగానే ఇవాళ జూబ్లీహిల్స్ పోలీసులు అసలు రెక్కీ జరిగిందో లేదో తేల్చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఇంటి ముందు రెక్కీ అనేదే జరగలేదని పోలీసులు తేల్చారు. జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకులను అదుపులోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు రెక్కీ జరగలేదని తేల్చారు. పవన్ కళ్యాణ్ పై ఎలాంటి రెక్కీ, దాడికి కుట్ర జరగలేదని పోలీసులు విచారణలో తేల్చారు. పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ముగ్గురు యువకులు కారు ఆపారని, కారు తీయమని పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది అడిగినందుకు గొడవ పడినట్లు యువకులు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. కేవలం మద్యం మత్తులోనే గొడవకు దిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. యువకులను ఆదిత్య, వినోద్, సాయికృష్ణలుగా గుర్తించారు. అనంతరం వారికీ నోటీసులు ఇచ్చారు. ఇది తాగుబోతులు చేసిన రగడ తప్ప రెక్కీ కాదని పోలీసులు తేల్చారు.