తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు కరీంనగర్ లోని బండి సంజయ్ ఇంటికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బండి సంజయ్ అరెస్టు పట్ల బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. బండి సంజయ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజ్ కు సంబంధించి బండి సంజయ్ కు సంబంధం ఉందన్న అనుమానంతో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజు తెలుగు ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వగా.. రెండో రోజు హిందీ పేపర్లు లీక్ అయ్యాయి.
హిందీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రశాంత్.. హిందీ పేపర్ ను బండి సంజయ్ కు పంపించినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. గతంలో గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో కూడా బండి సంజయ్ కు సిట్ రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు పదోతరగతి ప్రశ్నాపత్రాల విషయంలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కానీ ప్రివెన్షన్ లో భాగంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారని బండి సంజయ్ కుమారుడు భగీరథ వెల్లడించాడు. ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని బండి సంజయ్ సతీమణి వాపోయారు. మరి బండి సంజయ్ అరెస్ట్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.