తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నూతన పాలసీ ప్రకారమే బుధవారం నుండి వైన్ షాపుల్లో అమ్మకాలు మొదలయ్యాయి. తాజాగా ఖమ్మం జిల్లా(122 వైన్ షాపులు), భద్రాద్రి జిల్లా(88 వైన్ షాపులు)లలో ఈ నూతన మద్యం పాలసీని అధికారులు ప్రారంభించారు. ఇకనుండి రెండేళ్ల పాటు మద్యం విక్రయాలు జరిపేందుకు ఆయా షాపుల యజమానులకు లైసెన్సులు జారీ చేశారు. వైన్ షాప్స్ దక్కించుకున్న యజమానులు ప్రభుత్వ నిబంధనల మేరకు మొదటి టర్మ్ లైసెన్సు ఫీజులను చెల్లించి డిపో నుండి మద్యం కొనుగోలు చేశారు.
ప్రస్తుతం వైన్ షాప్స్ యజమానులు తమకు కేటాయించిన స్టాక్ అనుకూలమైన ప్రదేశంలో పెట్టి విక్రయాలు జరపవచ్చని అధికారులు తెలిపారు. అలాగే నిర్దేశించిన టైంలో షాపును గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు వీలు కల్పించారు. ఇకనుండి మద్యం విక్రయాలు తప్పనిసరిగా ఎంఆర్‌పీ రేట్లకే జరపాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. నూతన అమ్మకాల కోసం ఉమ్మడి జిల్లాల మద్యం వ్యాపారులు మొత్తంగా 45,481 కేసుల లిక్కర్, 15,854 కేసుల బీర్లను రూ.31.13 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్లు సమాచారం.
గడిచిన రెండేళ్లలో ఈ ఉమ్మడి జిల్లా నుండి మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.2,800 కోట్ల ఆదాయం ఖజానాకు చేరిందని, ప్రతి నెలా సగటున రూ.117 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలియజేసారు. ఈ కొత్త పాలసీలో మద్యం దుకాణదారులకు అమ్మకాల్లో రాయితీలు, ఫీజు చెల్లింపుల్లో వెసులుబాటు కల్పించి ప్రభుత్వం అమ్మకాలను ప్రోత్సహిస్తుంది. కావున ఈసారి మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి మంచి లాభాలు చేకూరే అవకాశం ఉందని ఎక్సయిజ్ అంచనా వేస్తున్నారు.