తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏమాత్రం చిన్న ఛాన్స్ దొరికినా విరుచుకుపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత సీఎం కేసీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో రాజ్యాంగం మారిస్తేనే దేశం బాగుపడుతుందని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు చేపడుతున్నారు.
తాజాగా ఈ విషయం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. దేశంలో నరేంద్రమోడీరాజ్యాంగం నడుస్తోంది, అంబేద్కర్ రాజ్యాంగం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందన్నారు. అంబేద్కర్‌ను కించపరిచిన అరుణ్ శౌరి లాంటి వ్యక్తులకు మంత్రి పదవులు బీజేపీ ఇచ్చింది వాస్తవం కాదా? అన్న మంత్రి తలసాని.. బీజేపీ-కాంగ్రేస్ నేతలు ఢిల్లీలో రాష్ట్రానికి రావల్సిన నిధులపై నిలదీయాలన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది ఏంటో చెప్పాలని నిలదీశారు.
రాజ్యాంగ సవరణ కావాలని ముఖ్యమంత్రి అడిగితే.. ఆ విషయాన్ని తప్పదోవ పట్టిస్తూ.. ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అంబేద్కర్ నిజమైన వారసులం టీఆర్ఎస్ పార్టీ కాబట్టే.. సబ్ ప్లాన్, దళితబంధు తెచ్చామన్నారు. సోషల్ మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలని అన్నారు.