ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుంచి తరచూ రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. గతంలో నీటి జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నేతలు, అధికారుల మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అలానే ఇరు రాష్ట్రాల మంత్రులు తరచూ పక్కరాష్ట్రంపై హాట్ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా తెలంగాణ మంత్రి హారీశ్ రావు ఏపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుంచి తరచూ రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. గతంలో నీటి జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నేతలు, అధికారుల మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అలానే ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు ఏపీపై పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి మాటలకు ఏపీ నేతలు సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవలే ఏపీలోని రోడ్ల అధ్వానంగా ఉన్నయంటూ మంత్రి కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి. హారిశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ నుంచి వచ్చిన వాళ్లు.. అక్కడ ఓటు రద్దు చేసుకుని తెలంగాణకు రండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం సంగారెడ్డి పట్టణంలో జడ్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థికమంత్రి హారీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలోఆయనతో పాటు జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, కలెక్టర్ శరత్, ఎంపీ బీబీపాటిల్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు ప్రైవేటుగా ప్రాక్టీస్ చేయకుండా చట్టంలో మార్పు తెచ్చామన్నారు. అలానే 950 మంది వైద్యులను నియమించామని హారీశ్ రావు తెలిపారు.
అనంతరం సంగారెడ్డిలో మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ గురించి ప్రస్తావించారు. ఏపీలో పాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి.. స్థిరపడిన వారికి బాగా తెలుసని ఆయన అన్నారు. అక్కడికి.. ఇక్కడికి భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని ఆయన చెప్పారు. అందుకే ఏపీలో ఓటు రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని ఏపీ నుంచి వచ్చిన కార్మికులకు సూచించారు. ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారని, అలానే ఆంధ్రప్రాంతం నుంచి కూడా చాలా మంది వచ్చారని ఆయన తెలిపారు.
ఏపీ నుంచి వచ్చిన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ..” ఏపీ, తెలంగాణ.. ఈ రెండు ప్రాంతాలనూ మీరు చూశారు. మీరు ఎప్పుడన్నా అక్కడికి పోతారు కదా? అక్కడి రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఏందో మీకు తెలియదా?. మరి మీకు అక్కడ ఓటెందుకు? అక్కడ రద్దు చేసుకుని ఇక్కడ నమోదు చేసుకోండి. ఏపీ నుంచి వచ్చినప్పటికి మీరు కూడా మావాళ్లే” అని హారీశ్ రావు అన్నారు. అలానే ఈ రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు.
కాబట్టి మీరు ఒక రాష్ట్రంలోనే ఓటు పెట్టుకోండి.. అదీ కూడా తెలంగాణలోనే పెట్టుకోండంటూ హారీశ్ రావు ఏపీ కార్మికులను ఉద్దేశించి అన్నారు. మేడే రోజున కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్తారని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో ఎకరా విస్తీర్ణంలో రూ.2 కోట్ల వ్యయంతో కార్మిక భవనం నిర్మిస్తామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని హారీశ్ రావు అన్నారు. మరి.. ఏపీపై తెలంగాణ మంత్రి హారీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.