కరోనా కారణంగా అత్యధికంగా దెబ్బతిన్న రంగాల్లో విద్యా రంగం ఒకటి. వైరస్ కు భయపడి.. చాలా రోజుల పాటు పాఠశాలలను మూసి వేయడమే కాక.. ఆ తర్వాత కూడా ఆన్ లైన్ క్లాసులనే కొనసాగించారు. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఫలితం గతేడాది ఇంటర్ రిజల్ట్స్ లో స్పష్టంగా కనిపించింది. చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీనిపై నిరసనలు వెల్లు వెత్తడంతో ప్రభుత్వం అందరిని పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరుసటి ఏడాది పరీక్షలకు సిద్ధం కావాలని చెప్పింది. ఈ క్రమంలో తాజాగా ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేసింది.
తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఫస్టియర్, ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్ట్రికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11 న ఎథిక్స్, 12న హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు జరగనున్నాయి.
ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకూ రెగ్యులర్ పరీక్షలు జరగనుండగా.. ఫస్టియర్ విద్యార్థులకు మే 6, 9 తేదీల్లో, సెకండియర్ విద్యార్థులకు మే 7, 10 తేదీల్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఇయర్ విద్యార్థుల తర్వాతి రోజు నుంచి సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.