చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు రావడం.. జీతాలు పొందడం అన్నది కామన్. అదే చదువుతూనే ఆదాయం పొందొచ్చు అంటే ఎంత బాగుంటుందో కదా! ప్యాకెట్ మనీ కోసం ఇంట్లో వారిపై ఆధార పడక్కర్లేదు. పైగా సంపాదించే అలవాటు విద్యార్ధి దశ నుంచే మొదలవుతుంది. ఇప్పటివరకు ఇలాంటి అవకాశం డిగ్రీ, పీజీ వంటి పైచదువులు చదివిన వారికే ఉన్నా.. ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఆ అవకాశం కలగనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం.. ప్రభుత్వం రిలయన్స్ సంస్థతో జతకట్టనుంది.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై అధికారులు ఇప్పటికే రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఉపయోగ పడే విధంగా ఇంటర్న్‌షిప్ ను ఎలా నిర్వహించాలన్న దానిపై చర్చించారు. వారాంతంలో లేదా సెలవుల్లో రోజుకు 4 గంటల పాటు ఈ ఇంటర్న్‌షిప్ నిర్వహించాలని నిర్ణయించారని సమాచారం. ఈ ఇంటర్న్‌షిప్ లో పాల్గొనే విద్యార్థులకు నెలకు రూ. 4 వేలు స్టైపెండ్ ఇచ్చే విధంగా ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ ఇంటర్న్‌షిప్ అవకాశాలు రిలయన్స్ ఆధ్వర్యంలో ఉన్న గార్మెంట్స్, డిజిటల్ వంటి పలు విభాగాల్లో కల్పించనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఇంటర్ బోర్డు అధికారులు రిలయన్స్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు కొత్త విషయాలు నేర్పడంతో పాటు స్టైపెండ్ ఇవ్వాలని నిర్ణయించడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారని వారు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.