తెలంగాణ డేంజర్ జోన్ కి చేరువలో ఉందా? తెలంగాణకు డేంజర్ ఏంటి? అభివృద్ధి విషయంలో దూసుకుపోతుంటే డేంజర్ అంటారేంటి? అనే కదా మీ అనుమానం. అవును ఆ అభివృద్ధికి కావాల్సిన పైసలు ఎక్కువ శాతం వచ్చే వ్యవస్థ వల్లే ఇప్పుడు తెలంగాణకు ముప్పు తెచ్చిపెడుతుంది.
రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం అనేది ఉండడం మంచిదే. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి వంటి విషయాల్లో ఒక రాష్ట్రంతో మరో రాష్ట్రానికి పోటీ ఉండాలి. అయితే ఇదే పోటీ నెగిటివ్ విషయంలో ఉండకూడదు. హెల్త్ లు పాడుచేసుకొని ఎగబడి ట్యాక్సులు కట్టడంలో తెలంగాణ యువత పంజాబ్ యువకులతో పోటీ పడుతుంది. అదేంటి ట్యాక్సులు కడితే మంచిదే కదా అనుకుంటే.. ఎవరికి కావాలండి బోడి ట్యాక్సులు? యువతే సరైన మార్గంలో లేకుండా ఉంటే ఈ ట్యాక్సులు, బాక్సులు ఏం చేసుకుంటామండీ అని విశ్లేషకుల మాట. మరే ప్రభుత్వ ఖజానా నింపడం కోసం యువత, పెద్దలు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరీ పన్నులు కడుతున్నారు. 15 ఏళ్ల వయసున్న పిల్లలు కూడా మద్యం అలవాటు చేసుకుంటున్నారని, ఇది ఇలానే కొనసాగితే పంజాబ్ నే దాటిపోతామని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ ఇప్పుడు డేంజర్ జోన్ కి దగ్గరలో ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ ఎం. పద్మనాభరెడ్డి అన్నారు. వారి అంచనా మేరకు 15 ఏళ్ళు పైబడిన వారిలో 90 శాతం మంది పలు రకాల మద్యం తాగుతున్నారని అన్నారు. మొదట కల్లు, బీరు, విస్కీ, అలవాటు చేసుకుంటున్నారని.. ఆ తర్వాత గంజాయి, డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారని అన్నారు. ఇప్పటికే పంజాబ్ మద్యం వినియోగం నుంచి డ్రగ్స్ వినియోగం వైపు మళ్లిందని, తెలంగాణలో పరిమితికి మించి మద్యం వినియోగం జరుగుతుందని, కొన్నాళ్ళకు ఈ మత్తు చాలక గంజాయి, డ్రగ్స్ వైపు యువత వెళ్తారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం మద్య నియంత్రణ కార్యాచరణ ప్రకటించకపోతే తెలంగాణ మరో పంజాబ్ అవ్వడానికి ఎంతో సమయం పట్టదని ఎం. పద్మనాభరెడ్డి హెచ్చరించారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.