కొన్ని రోజుల క్రితమే మద్యం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో సంచలన నిర్ణయం తీసుకొనేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..
మద్యపానం వల్ల ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కూడా చాలా మంది మందు మానరు. ఇక ప్రభుత్వాలకు మద్యం మీద వచ్చే ఆదాయం ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పాల్సని పనిలేదు. మన దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది కల్ల. ఏ ప్రభుత్వం కూడా అంత సాహసం చేయదు. ఇక కొన్ని రోజుల క్రితమే తెలంగాణ సర్కార్ మద్యం రేట్లు తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. బార్లలో కొత్త రూల్స్ అమలుకు నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
కరోనా తర్వాత పలు రంగాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాటిల్లో బార్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కోవిడ్ పరిస్థితుల తర్వాత మనుగడ సాగించలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలోని 1,172 బార్లకు ఆర్థిక ఆసరా కలిగేలా ఎక్సైజ్ శాఖ నిబంధనలను సవరించింది. లైసెన్సింగ్ విధానాన్ని సరళతరం చేయడం మాత్రమే కాక.. బ్యాంకు గ్యారెంటీల తగ్గింపు, లైసెన్స్ ఫీజు చెల్లింపులో ఉదారత, కమీషన్ పెంపు లాంటి చర్యల ద్వారా బార్లు ఆర్థికంగా కోలుకునేలా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు వైన్ షాపుల్లోనే క్వార్టర్, హాఫ్ బాటిళ్లు అందుబాటులో ఉండగా త్వరలోనే బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా వాటి అమ్మకాలకు సంబంధింఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వనుంది. అయితే ఈ నిర్ణయం పట్ల వైన్‌షాప్ యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. క్వార్టర్, హాఫ్ బాటిళ్లు బార్ అండ్ రెస్టారెంట్లలో అమ్మితే తమ అమ్మకాలు కుంటుపడతాయని వారు చెబుతున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ మాత్రం ఇప్పటికే 2బీ (బార్ అండ్ రెస్టారెంట్) లైసెన్సుల కింద స్టార్ హోటళ్లలో క్వార్టర్లు, హాఫ్‌లు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు సాధారణ బార్ అండ్ రెస్టారెంట్లకూ దీన్ని వర్తింపజేస్తున్నామని చెబుతోంది. ఇలా చేయడం ద్వారా కస్టమర్లకు తాను కొనే మద్యం బ్రాండ్లపై నమ్మకం ఉంటుందని, స్టాక్ సమస్య రాదని, తయారీదారుడికి సైతం వెసులుబాటు ఉంటుందని తెలుపుతున్నారు.