ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈరోజు ఉదయం బీపీ డౌన్ కావడంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతాపం తెలిపింది.మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.
రోశయ్య మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. పలు పదవులకు కొణిజేటి రోశయ్య వన్నె తెచ్చారని కేసీఆర్ అన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా తనదైన శైలిని రాజకీయాల్లో ప్రదర్శించారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన ఉమ్మడి ఏపీలో చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోశయ్య మృతికి సంతాపం తెలియజేస్తూ… రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. డిసెంబర్ 4,5,6 తేదీలను సంతాప దినాలు పాటించాలని ఆదేశించింది. రోశయ్య అంత్యక్రియను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్తానంలో రోశయ్య అంత్యక్రియలను నిర్వహించనున్నారు.