ఇప్పటి వరకూ విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఆ విద్యార్థులకు కూడా కాలేజీ ఫీజులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తూ వచ్చిన ప్రభుత్వం.. జాతీయ స్థాయిలో కూడా దీన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వాలు స్కాలర్ షిప్ లు అందిస్తుంటాయి. కొన్ని ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్ మెంట్ కూడా ఇస్తుంటాయి. తాజాగా జాతీయ స్థాయిలో ఉన్నత చదువులు చదివే బీసీ విద్యార్థులకు పూర్తిగా ఫీజులు ఉచితమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ వర్సిటీలు సహా మొత్తం 200కు పైగా ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన బీసీ విద్యార్థులకు మొత్తం ఫీజు ప్రభుత్వమే ఉచితంగా చెల్లిస్తుందని కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండేదని.. ఇప్పుడు బీసీలకు కూడా ఈ అవకాశాన్ని వర్తింపజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నత స్థాయి చదువులు చదివే బీసీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్ మెంట్ ఉంటుందని అన్నారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 10 వేల మంది బీసీ విద్యార్థులు లబ్ది పొందుతారని అన్నారు. దీని కోసం ఏటా 150 కోట్ల నిధులను కేటాయించనుందని అన్నారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వంటి దేశాల్లో ఉన్నత చదువులు చదివే బీసీ విద్యార్థులకు ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు అందిస్తుందని.. రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇక నుంచి ఇతర రాష్ట్రాల్లో చదివే బీసీ విద్యార్థులకు కూడా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.