హైదరాబాద్ నగరం, జూబ్లీహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌లో ఓ చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్కూల్లో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఎల్‌కేజీ చిన్నారిపై పాడు పనికి పాల్పడ్డాడు. నెలల పాటు చిత్రహింసలకు గురి చేశాడు. ఈ నేపథ్యంలోనే డ్రైవర్ లైంగిక దాడి విషయం బాలిక తల్లిదండ్రులు తెలిసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన వారు నిందితుడ్ని చితక బాది పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ అయింది. రాష్ట్ర విద్యాశాఖ డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది.
అయితే, మధ్యలో ఇలా స్కూలు మూసివేస్తే తమ పిల్లల చదువుకు ఇబ్బంది కలుగుతుందని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వందల సంఖ్యలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని పేర్కొన్నారు. ఓ సంవత్సరం పాటు కొనసాగించాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తికి విద్యాశాఖ సానుకూలంగా స్పందించింది. మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీఏవీ స్కూల్ గుర్తింపును మళ్లీ పునరుద్ధరించింది. స్కూల్‌కు ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలికంగా అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.
కాగా, డీఏవీ స్కూల్‌లో బాలికపై అఘాయిత్యం ఘటనపై కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. నాలుగేళ్ల పసిబిడ్డపై అఘాయిత్యం తనను కలిచి వేసిందన్నారు. సదరు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అన్ని స్కూళ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. భావి తరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఈ ఘటనపై స్పందించారు. చిన్నారిపై లైంగిక దాడి దారుణమన్నారు. పిల్లల రక్షణ విషయంలో రాజీపడితే.. దారణమైన సమాజాన్ని రూపొందించిన వారమవుతామని స్పష్టం చేశారు.