విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయటాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
విశాఖ స్టీల్ ప్లాంట్.. ఇది కేవలం వస్తువులను తయారు చేసే ఓ ఫ్యాక్టరీ మాత్రమే కాదు.. ఆంధ్రుల ఎమోషన్ కూడా. పోరాటాలతో నిర్మించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం వెనుక ఎంతో మంది కృషి, బలిదానాలు ఉన్నాయి. దశాబ్ధాల చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేసిన పోరాటం చరిత్రలో ఇప్పటికీ చిరస్మరణీయమే. ఎంతో కష్టపడి, ప్రాణాలకు తెగించి సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో గత కొన్నేళ్లుగా హైడ్రామా నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయటానికి నిర్ణయించింది.
ఈ మేరకు సన్నాహాలు కూడా మొదలయ్యాయి. తాజాగా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్వహణ, ఇతర విషయాలకు సంబంధించి టెండర్లను ఆహ్వానించగా ఊహించని పరిణామం చేటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ టెండర్లలో పాల్గొనటానికి నిర్ణయించుకుంది. దీంతో కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో ఓ చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఉందా?
స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి అవసరమైన మూలధనం, ముడిసరుకు కోసం నిధులు ఇవ్వటంతో పాటు నిబంధనల మేరకు ఉత్పత్తులను కొనేందుకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ గత నెల 27న టెండర్లను ఆహ్వానించింది. ప్రైవేట్, ఇతర ఉక్కు అనుబంధ రంగాల సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని కోరింది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. టెండర్లను రాష్ట్రం ప్రభుత్వం సాధిస్తే.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడతామని బీఆర్‌ఎస్ చెబుతోంది. అయితే, ఇందులో ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ విషయం కంటే రాజకీయ కోణమే ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం..
కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించేందుకు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కొత్త కూటమిని తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పార్టీని దేశ వ్యాప్తంగా బలపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తోటి తెలుగు రాష్ట్రం అయిన ఏపీలో బీఆర్‌ఎస్ జెండా పాతేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందివచ్చే ప్రతీ అవకాశాన్ని వాడుకోవటానికి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రుల ఎమోషన్ అయిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేసీఆర్ గట్టిగా గళం విప్పారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయటాన్ని తప్పుబట్టారు. ఇప్పుడు ఏకంగా బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు సిద్దపడ్డారు.
ఈ విధంగా చేయటం ద్వారా ఏపీ ప్రజలకు దగ్గరవుతామని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకవేళ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధిస్తే.. ఏపీ ప్రజల దృష్టిలో బీఆర్‌ఎస్‌కు మంచి మార్కులు పడతాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయలేని పనిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపిందన్న ఆలోచన ప్రజల్లో మొదలవుతుంది. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ పోరాటంతో సాధించుకున్న ప్లాంట్ ద్వారా ఏపీలో తెలంగాణ తరహా పోరాటం చేయటానికి ఆస్కారం ఉంటుంది. ఎమోషనల్‌గా ప్రజలకు దగ్గర అవ్వొచ్చు.
తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన బిడ్డింగ్‌లో పాల్గొనటం నిజంగా ఓ విప్లవాత్మక నిర్ణయమే. బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధిస్తుందా? లేదా? అన్న సంగతి పక్కన పెడితే.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటంలో బీఆర్‌ఎస్ బలమైన ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ఈ నిర్ణయం ద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదని దేశ వ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయటంతో పాటు.. కేంద్రాన్ని ఎదుర్కోవటంలో తాము ఏ మాత్రం తగ్గమన్న సంకేతాలను సైతం పంపవచ్చు.
ఇక, ఏపీలో కూడా బీఆర్‌ఎస్ పట్ల సానుకూల పవనాలు వీస్తాయి. రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు తీసుకురాకపోయినా.. ప్రజల్లో బీఆర్‌ఎస్ పట్ల పాజిటివ్ ఆలోచన మొదలవుతుంది. మెల్లగా ఓటు బ్యాంకు కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ నిర్ణయంతో ఓ వైపు కేంద్రంతో పోరాటం చేయటంతో పాటు.. మరో వైపు ఏపీ ప్రజలకు దగ్గర కావచ్చు. మరి, తెలంగాణ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనంలో రాజకీయ కోణం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.