తెలంగాణ ప్రభుత్వం వారికి ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓ ప్లాన్‌ను సిద్దం చేయాలని చెప్పారు.
దివ్యాంగుల సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. వారికి సంబంధించిన అన్ని పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా సక్రమంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన దివ్యాంగులకు కచ్చితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. సదరం క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. క్యాంపుల ద్వారా సర్టిఫికెట్లతో పాటు చక్రాల కుర్చీలు పంపిణీ చేయాలని అన్నారు. దివ్యాంగుల ప్రయాణానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేలా కొత్తరకం బ్యాటరీ సైకిళ్లను పంపిణీ చేయటానికి ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వం ఆసరా పేరిట ప్రతి దివ్యాంగుడికి నెలనెలా దాదాపు 3,016 రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని జిల్లాల వ్యాప్తంగా ప్రతి నెలా వారి సంక్షేమం కోసం కొన్ని కోట్ల రూపాయలు పంపిణీ చేస్తోంది. అంతేకాదు! తరచుగా ఎలక్ట్రిక్ స్కూటీలు, వీల్‌చైర్స్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్స్ అందిస్తోంది. సదరం శిబిరాలు ప్రతినెలా నాలుగు సార్లు నిర్వహిస్తుండగా.. జనవరి నుంచి ఎనిమిది సార్లు నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది.