తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం కీలక ప్రకటన చేసింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు పరీక్ష తేదీలను ప్రకటించడమే కాకుండా.. వేసవి సెలవులపై కూడా ప్రకటన జారీ చేశారు.
తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పరీక్షలు ఎప్పుడు? వేసవి సెలవులు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఆ ప్రకటన రానే వచ్చింది. ఈ విద్యా సంవత్సరానికిగానూ ప్రభుత్వ- ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించింది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించనున్నారు. 2023-2024 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుందని విద్యాశాఖ ప్రకటించింది.
విద్యార్థుల పరీక్షల విషయానికి వస్తే.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఆరో తరగతి నుంచి ఎనమిదో తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న విద్యార్థుల పరీక్ష పత్రాలను ఏప్రిల్ 21 నుంచి 24 వరకు మూల్యాకణం చేసి మార్క్స్ ని ప్రకటిస్తారు. మార్కుల ప్రకటన చేసిన తర్వాత విద్యార్థులకు సెలవులు ఇస్తారని తెలియజేశారు.