కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతిఒక్కరు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డీహెచ్ శ్రీనివాస్ రావు సూచించారు. డీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కొవిడ్ వ్యాప్తి పూర్తిగా పోలేదని.. రానున్న మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందన్నారు. అయితే పక్క రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ‘రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన స్పష్టం చేశారు. మాస్కు ధరించకపోతే నేటి నుంచి పోలీసులు రూ. వెయ్యి జరిమానా విధిస్తారని తేల్చిచెప్పారు’.
రాష్ట్రంలో కొవిడ్ అదుపులోనే ఉంది. హైదరాబాద్ మినహా మరెక్కడా 10కి పైగా కేసులు నమోదు కావడం లేదు.ఏప్రిల్, మే, జూన్ వరకు వివాహాలు, విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు నెలలు ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలు ప్రజలు పాటించాలి. పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో సుమారు 25 లక్షల మందికి పైగా సెకండ్ డోసు తీసుకోని వారు ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 15 లక్షల మంది సెకండ్ డోసు తీసుకోని వారున్నారు. రాష్టంలో 80 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. రెండు డోసులు తీసుకోవడం ద్వారానే పూర్తి రక్షణ లభించే అవకాశం ఉంది. డిసెంబర్ 31వ తేదీలోపు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం: హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్..
ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రాకూడదంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. 60 ఏళ్ల పైబడిన వారికి అన్ని ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ కేంద్రాల్లో బూస్టర్ డోసు ఇస్తున్నాం. వయసుల వారీగా అర్హత ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవాలి. రెండో డోసు తీసుకున్న 9 నెలల తరువాత బూస్టర్ డోసు తీసుకోవాలి” అని డీహెచ్ వివరించారు.