మందుబాబులు.. చాలా మంది వీళ్లని చులకనగా చూస్తుంటారు. ఛీ తాగుబోతు అంటూ తక్కువ చేసి మాట్లాడతారు. ఎవరు చెప్పారు సార్ వాళ్లు తక్కువ మనుషులని.. ఎవరన్నారు సార్ వాళ్లకి బాధ్యత లేదని? నిజానికి దేశం మొత్తంలో బాధ్యత, నిబద్ధత ఉన్నవాళ్లు మందుబాబులే అంటే మీరు నమ్ముతారా? అవును రోజు మొత్తంలో ఏ పని చేసినా చేయకపోయినా టంచన్‌గా సాయంత్రం అయ్యేసరికి దుకాణానికి వెళ్లి ట్యాక్స్ కడతారు. వాళ్లే లేకపోతే అందరికీ ఈ రోడ్లు, ఫ్లైఓవర్లు, స్మార్ట్ సిటీలు ఇవన్నీ రావు సార్. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో రోజూ వాళ్లు కట్టే పన్ను కూడా ఉంటుంది. వాళ్లే తాగడం మానేస్తే చాలా రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతాయంటే నమ్ముతారా? సరే సరదాగా ఇలాంటిచి ఎన్ని చెప్పుకున్నా.. అసలు ఒక్కరోజు మందుబాబులు మద్యం మానేస్తే రాష్ట్రం ఎంత నష్టపోతుందో లెక్కలతో సహా చూద్దాం రండి.
ఈ దసరా సందర్భంగా తెలంగాణలో అసలు ఎంత మద్యం అమ్మకాలు జరిగాయో తెలుసా? ఒక్కవారంలో మందుబాబులు అక్షరాలా రూ.1100 కోట్లకు పైగా మద్యం సేవించారంటే నమ్ముతారా? సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు డిపోల నుంచి దుకాణాలకు 1,320.91 కోట్ల రూపాయల మద్యం సరఫరా చేశారు. ఒక్క సెప్టెంబర్ 30వ తేదీన 313.64 కోట్ల రూపాయాల మందు తాగేశారు. పండగ సందర్భంగా అక్టోబర్ న రూ.138.30 కోట్లు, అక్టోబర్ 4న రూ.192.48 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. లివర్ డామేజ్ అయినా గానీ, రాష్ట్రం బాగుండాలని కోరుకునే మంచివాళ్లు సార్ మందుబాబులు. ఎప్పుడూ రాష్ట్రం కోసం ఆలోచిచండమే గానీ, వారికి కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వమని కోరరు.
అయితే ఇప్పుడు తెలంగాణ మందుబాబులు ఒక రికార్డు కూడా బద్దలు కొట్టారు. అది ఓనం సందర్భంగా కేరళ క్రియేట్ చేసిన రికార్డును తెలంగాణ మందుబాబు చెప్పి మరీ బద్దలు కొట్టారు. ఈ ఏడాది ఓనం సందర్భంగా కేరళలో ఒక వారం మొత్తం రూ.624 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే అప్పుడు వార్తల్లో మద్యం అమ్మకాల్ల కేరళ రికార్డులు అంటూ వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో తెలంగాణ మందుబాబులు ఛాలెంజ్ చేశారు. మీ రికార్డును బ్రేక్ చేయాలంటూ మాకు మూడ్రోజులు చాలని చెప్పిన విధంగానే కొట్టి చూపించారు. వాళ్లు వారంపాటు తాగితే.. మనవాళ్లు సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, అక్టోబర్ 4 ఈ మూడ్రోజుల్లోనే రూ.644.48 కోట్ల మేర మద్యం తాగేశారు. అలా తెలంగాణ మందుబాబులు చెప్పి మరీ కేరళ రికార్డుస్థాయి మద్యం అమ్మకాలను బద్దలు కొట్టారు. కొట్టడమే కాదు.. కొట్టిన తర్వాత మేం తాగడం మొదలిడితే అట్లుంటది అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.