ఏడాది మొత్తం కష్టపడి చదివి పదో తరగతి పరీక్షలు రాస్తారు. తీరా పరీక్షలు రాశాక ఫలితాల కోసం రోజుల తరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. ఇటీవలే పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. మరి ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే?
తెలుగు, హిందీ పేపర్ లీక్ వ్యవహారం తర్వాత తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఇటీవలే ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 4,84,384 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 1810 మంది పరీక్షలకు హాజరు కాలేదు. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తం 18 సెంటర్లలో ఈ వాల్యుయేషన్ ప్రక్రియ జరుగుతుండగా.. ఏప్రిల్ 21వ తేదీ వరకూ కొనసాగనుంది. ఆ తర్వాత టేబులేషన్ ప్రక్రియ మరో 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
అయితే పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీచర్ల అనాసక్తి, అసంతృప్తి కారణంగా జవాబు పత్రాలను దిద్ది మార్కులు వేసే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కొందరు టీచర్లు అనారోగ్యం అని, అత్యవసరం కారణం అని చెబుతూ స్పాట్ వాల్యుయేషన్ చేయకుండా తప్పించుకుంటున్నారని.. మరి కొందరు సమాచారం ఇవ్వకుండా హాజరు కావడం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు ఉండడం లేదని.. వేసవి కాలం కావడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో పేపర్ వాల్యుయేషన్ కు సాకులు చూపించి టీచర్లు హాజరు కావడం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే విద్యాశాఖ మాత్రం బలమైన కారణం ఉంటే తప్ప సెలవు పెట్టడానికి వీల్లేదని హెచ్చరించింది. 30 లక్షలకు పైగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ టీఎస్పీఎస్సీ మాత్రం పదో తరగతి పరీక్ష ఫలితాలను వీలైనంత తొందరగా విడుదల చేయాలని కసరత్తులు చేస్తోంది. మే 3వ వారంలో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు.