తీన్మార్ మల్లన్న ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ది ముసుగులో దొంగలు దోచుకుంటున్నారు.. రాష్ట్ర సంపద మొత్తం 7200 మంది దొంగలు నాశనం చేస్తున్నారు. ఈ నెంబర్ పేరుతోనే ఆయన ఒక కార్యక్రమాన్ని నిర్వహించి అధికార పార్టీపే దుమ్మెత్తి పోశారు. ఇటీవల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొద్ది రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రాన్ని కాపాడుకుందామని.. అందుకు తాను కొత్త పార్టీ పెడతానని తెలిపారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో తీన్మార్ మల్లన్న టీం-7200 ముఖ్య కార్యకర్తల తో ఒక ముఖ్య సమావేశం ఏర్పాటుచేశారు. ఉచిత విద్య, వైద్యం, ప్రజలకు సత్వర న్యాయంపై తీర్మానాలు చేశారు. తాను ఇక ముందు బీజేపీ ఆఫీస్ లోకి అడుగు పెట్టనని శపథం చేశారు. తనపై అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని అవాంతరాలు వచ్చినా తమ టీం-7200 భయపడదని చెప్పారు. త్వరలో ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రంలో జరిగే ప్రతి అన్యాయం గురించి తెలియజేస్తానని అన్నారు.
ఇక తాను ప్రజా క్షేత్రంలో ఉంటూ పోరాటానికి సిద్దమవుతానని.. తనకు ఉన్న ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి అప్పజెప్పి రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. ఇక్కడ అందరికీ సమ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటో త్వరలో వెల్లడిస్తామన్నారు తీన్మార్ మల్లన్న. అంతేకాదు ప్రజల అండతో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు.