ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ చావు అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. దానికి ఆ యువకుడు భయపడకుండా స్వాగతం పలికాడు. తను చనిపోయాక తన మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లేలా అక్కడ ప్రభుత్వ అనుమతులు తీసుకుని అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. తాను ఆస్ట్రేలియాలో చనిపోతే తన మృతదేహాన్ని ఇండియా రప్పించడం కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం తానే దగ్గరుండి తన చావు తర్వాత మృతదేహాన్ని భారత్ కు తరలించే ఏర్పాట్లు చేసుకున్నాడు. కన్నీళ్లు పెట్టించే ఈ గాథ ఖమ్మం నగరానికి చెందిన యువకుడిది.
ఖమ్మంలోని శ్రీనివాస్ నగర్ కు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు హర్షవర్ధన్ (33), చిన్న కొడుకు అఖిల్. హర్షవర్ధన్ బీఫార్మసీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసమని 2013లో ఆస్ట్రేలియా వెళ్లడం జరిగింది. అక్కడ బ్రిస్బేన్ లో ఓ యూనివర్సిటీలో హెల్త్ మేనేజ్మెంట్, జనరల్ మెడిసన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత క్వీన్స్ ల్యాండ్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో డాక్టర్ గా చేరాడు. 2020 ఫిబ్రవరి 20న ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. భార్యను వీసా వచ్చిన తర్వాత తీసుకెళ్తానని చెప్పి అదే నెల 29న ఆస్ట్రేలియా తిరుగు ప్రయాణం చేపట్టాడు. ఐతే 2020 అక్టోబర్ లో వ్యాయామం చేస్తున్న హర్షవర్ధన్ కి దగ్గు, ఆయాసం రావడంతో హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోగా ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తేలింది.
ఇంట్లో వాళ్లకి చెప్తే ఇంటికొచ్చేయమని అన్నారు. ఐతే ఇక్కడ వైద్యం చేయించుకుంటానని చెప్పి అక్కడే ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు. రెండేళ్లు గడిచినా కూడా మందులు, వైద్యుల ప్రయత్నాలు అతని వ్యాధిని తగ్గించలేకపోయాయి. తొలుత క్యాన్సర్ కు చికిత్స చేయించుకోగా.. నయమైందని వైద్యులు చెప్పారు. 2022 సెప్టెంబర్ నెలలో ఖమ్మం వచ్చిన హర్షవర్ధన్.. 15 రోజులు కుటుంబ సభ్యులతో గడిపి వెళ్ళిపోయాడు. ఐతే ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత క్యాన్సర్ తగ్గలేదని తెలిసింది. ఇక చికిత్సకు లొంగదని, మరణం తప్పదని వైద్యులు నిర్ధారించారు. ఇక తాను చనిపోవడం ఖాయమని ఫిక్స్ అయిన హర్షవర్ధన్ తన భార్య జీవితంలో స్థిరపడేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి ఆమెకు విడాకులు ఇచ్చాడు. బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పాడు.
‘కొన్ని రోజుల్లో వెళ్లిపోతున్నా.. తమ్ముడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు’ అని ధైర్యం చెప్పాడు. తాను చనిపోయాక తన మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ దేశ చట్టాలకు అనుగుణంగా ఒక లాయర్ ను పెట్టుకుని అనుమతులు తీసుకున్నాడు. చనిపోయే ఆఖరి క్షణాల్లో కుటుంబ సభ్యులకు, బంధువులకు వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. కొందరు స్నేహితులను ఇంటికి పిలిపించుకుంటూ ఉండేవాడు. అలా చివరిగా మార్చి 24న తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. హర్షవర్ధన్ మృతదేహం బుధవారం ఉదయం ఖమ్మంలోని అతని నివాసానికి చేరడంతో తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. క్యాన్సర్ రాకపోయి ఉంటే తమ పెద్ద కొడుకు.. మే 21న చిన్న కొడుకు పెళ్లికి నవ్వుతూ ఇండియా వచ్చేవాడని తల్లిదండ్రులు కుమిలికుమిలి ఏడుస్తున్నారు. కన్నీరు పెట్టించే ఈ యువకుడికి సద్గతులు ప్రాప్టించాలని కోరుకుందాం. ఓం శాంతి.