హైదరాబాద్ లోని నార్సింగిలో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సాత్విక్ ఆత్మహత్యపై తోటి విద్యార్థులు సంచలన విషయాలు చెప్పారు.
హైదరాబాద్ లోని నార్సింగిలో శ్రీ చైతన్య కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి పదిన్నర సమయంలో తరగతి గదిలో ఉరి వేసుకున్నాడు. సాత్విక్ మృతితో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాలేజీలో ఒత్తిడి వల్లే తమ స్నేహితుడు ఉరి వేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్యపై కాలేజీ యాజమాన్యం స్పందించలేదని, కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లలేదని విద్యార్థులు ఆరోపించారు. తాజాగా సాత్విక్ సోదరుడు, ఇతర విద్యార్థులు ఈ ఘటనపై సంచలన విషయాలు చెప్పారు.
కాలేజీ క్యాంపస్ లో హాస్టల్ లో ఉంటున్న సాత్విక్.. రాత్రి పదిన్నర గంటల సమయంలో తరగతికి గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. సాత్విక్ ను లెక్చరర్లు పదే పదే ఫెయిల్యూర్ అనేవారని.. అందరి ముందు కొట్టేవారని.. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని విద్యార్థులు అంటున్నారు. ఇక ఈ ఘటన గురించి విద్యార్థులు మాట్లాడుతూ.. “రాత్రి పది గంటలకు విద్యార్ధులు వస్తుంటే.. ఫీజు కట్టలేదంటూ లోపనికి రానివ్వమంటరు కానీ అదే పది గంటల సమయంలో విద్యార్థికి ఇలాంటి ఘోరం జరిగితే ఆస్పత్రికి తీసుకెళ్లేందు ఒక్కరు లేరు. లోపల సాత్విక్ ఊరేసుకుంటే బయట తాళం వేసి ఉంది. తోటి విద్యార్థులు చూసి ఆ తలుపు తీశారు. ఇలా విద్యార్థి ఏమయ్యాడు అనే ఆలోచన కూడా వాళ్లకి ఉండదా?.
వాళ్ల స్టూడెంట్ ఎక్కడి వెళ్లారో తెలుకోవాల్సిన బాధ్యత వారికి లేదా? సాత్విక్ కనిపించకపోతే వెతికింది తోటి విద్యార్థులే, ఎవరో ఒక్క మాస్టర్ మాత్రం వచ్చాడు. ఇతర విద్యార్థులకు చెప్తుంటే.. ఎవరకి చెప్పవద్దు.. సైలెంట్ గా తీసుకెళ్లండి అని చెప్పారు. ఆస్పత్రి వద్దకు వచ్చిన ఆ మాస్టర్ ఒక్క నిమిషం కూడా లేరు.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలానే సాత్విక్ సోదరుడు కూడా ఘటనకు సంబంధించి అనేక విషయలు చెప్పాడు. మా తమ్ముడిని తీసుకెళ్లింది. ఇద్దరు విద్యార్థులు మాత్రమే.. కాలేజీ సిబ్బంది అంటూ ఎవరూ రాలేదని తెలిపాడు.
ఈ క్రమంలో నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 305 కింద కేసు నమోదు చేశారు. కాలేజీ మేనేజ్ మెంట్ పై కేసు పెట్టిన నార్సింగ్ పోలీసులు. తండ్రి ఫిర్యాదు మేరకు వైస్ ప్రిన్సిపల్ ఆచార్య, ఫ్యాకల్టీ కృష్ణా రెడ్డి, వార్డెన్ నరేష్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశించారు. అలానే ఈ ఘటనపై కాలేజీ విద్యార్థులు సంచలన విషయాలు బయటపెట్టారు.