ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతూ వస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు తోలేందుకే మొగ్గు చూపుతున్నారు. మరికొంత మంది సొసైటీలో తమ గౌరవం కోసం పంపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది తక్కువ అవుతూ వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో పాఠశాలలను మూసివేయక తప్పడంలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ప్రభుత్వాలు తెగ కష్టపడుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులు స్వయంగా తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ బడులకు పంపించాల్సిందిగా కోరుతున్నారు. ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగైన వసతులు, చక్కటి బోధన ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం కోట్ల ఖర్చు పెడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకుంటలో కొంత మంది ప్రజా ప్రతినిధులు ఓ అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన ప్రతి విద్యార్థికి రూ.5 వేల రూపాయలు ఇస్తామని సర్పంచ్ ఆకిటి మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆంజనేయులు నిర్ణయించారు. అంతే కాదు సర్కార్ బడుల విషయంలో తల్లిదండ్రులకు ఉండే అపోహలు కూడా తొలగిపోయేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు యూనిఫామ్‌లు, బూట్లు, సాక్సులు, బస్‌పాస్ అందిస్తామని తెలిపారు.
ఇక తాము ప్రకటించిన వివరాలు మొత్తం స్కూల్ గేట్ ముందు ఫ్లెక్సీలతో ఏర్పాటు చేశారు. అయితే అక్కడ కొంత మంది దాతల సహాయంతో స్కూల్ ని అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యాబోధన కల్పిస్తున్నామని చెబుతున్నారు. ఉచిత మధ్యాహ్న భోజనం.. ఇంతకన్నా ఇంకేం కావాలి అంటూ.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయంపై అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రజా ప్రజాప్రతినిధులు అంటున్నారు.ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.