ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల స్వైర విహారం మరీ ఎక్కువ అయ్యాయని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఏ క్షణంలో తమపై దాడులు చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని.. ఇప్పటికే పలువురు వీధి కుక్కల దాడుల్లో తీవ్రంగా గాయపడటమే కాదు.. చనిపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే చిన్నారిని కుక్కలు దాడి చేసి అతి దారుణంగా చంపిన ఘటగన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ ఘటనపై ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. ఈ ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కుక్కలు దాడి చేసిన గాయపర్చిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం పుటానీ తండాలో కుక్కల దాడిలో ఓ బాలుడిపై వీధి కుక్కలు అతి దారుణంగా దాడి చేసి చంపాయి. హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే చిన్నారి మృతి చెందిన విషాద ఘటన మరువక ముందే రఘునాథపాలెంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తండాలోని గ్రామ పంచాయితీ పరిధిలో నివసించే బానోతు రవిందర్, సంద్య దంపతుల చిన్న కుమారుడు అయిన భరత్.. వయసు 5 సంవత్సరాలు.. పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో వీధిలో ఉన్న కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో భరత్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలున్ని దగ్గరలోని ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించారు.
వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ భరత్ పరిస్థితి విషమంగా ఉందని వెంటనే హైదరాబాద్ లోని నీమ్స్ కి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆర్టీసీ బస్సు లో వెళ్తున్న సమయంలో మార్గమద్యలోనే భరత్ కన్నుమూశాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు వచ్చిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. చిన్నారి మరణ వార్త విని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ గ్రామలంలో కొంత కాలంగా వీధి కుక్కల బెడద ఎక్కువ అయ్యిందని.. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.