సాధారణంగా మన ఇండ్లలో కుక్కలు, పిల్లులు, కుందేళ్ల తో పాటు చిలుకలు, పావురాలు, కొన్ని రకాల పక్షులను సాదుకుంటారు.. అవి కుటుంబ సభ్యులతో ఎంతో ఆత్మయబంధాన్ని ఏర్పరుచుకుంటాయి. వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా విల విలలాడిపోతారు. అవి కూడా తమ యజమాని పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపిస్తుంటాయి. ఓ కుర్రాడికి ఉడుతకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది.. ఆ ఉడుత కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉండిపోయింది. లేచింది మొదలు వారితోనే ఉంటుంది.. వాళ్ల బుజాలపైకి ఎక్కి సందడి చేస్తుంది. మొత్తానికి ఆ బుచ్చి ఉడుత వారి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఉండిపోయింది.
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా జనగామ హైవే పక్కన కలీం దంపతులు టీ స్టాల్, గాలి మిషన్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు అస్లాం అనే కొడుకు ఉన్నాడు. ఒకరోజు చెట్టుపై కాకులు పెద్దగా అరుస్తుండటం అస్లాం విన్నాడు. అక్కడికి వెళ్లి చూడగా చిన్న ఉడుత పిల్లను కాకులు పొడుస్తూ కనిపించాయి. వెంటనే రాళ్లతో వాటిని తరిమేసి ఆ చిన్ని ఉడుత పిల్లను తన ఇంటికి తీసుకువచ్చాడు. అయితే తీవ్రమైన గాయాలతో ఉన్న ఆ ఉడుత పిల్ల బతికే ప్రసక్తే లేదని స్నేహితులు, కుటుంబ సభ్యులు అన్నారు. కానీ, అస్లాం మాత్రం దాన్ని బతికించే తీరాలని.. పట్టుబట్టాడు.
ఇక కొడుకు బాధ చూడలేక ఉడుత పిల్ల గాయాలకు పసుపు రాసి కట్టు కట్టారు. ఆ తర్వాత పాలు పట్టించారు. 20 రోజుల్లో ఆ ఉడుత పిల్ల పూర్తిగా కోలుకుంది. ఉడుత కోసం ఈ కుటుంబం ఓ బాక్స్ కూడా తయారు చేయించింది. అందులో గుడ్డలు పెట్టి పాన్పులా ఏర్పాటు చేశాడు అస్లాం. దానికి ఆకలైతే.. అరుపులతో గుర్తు చేస్తుంది. వాళ్లు దానికి పాలు, పండ్లు అందిస్తారు. ఇలా అస్లాం కుటుంబంతో ఉడుతకు మంచి ఆత్మీయ సంబంధం ఏర్పడింది.
ఇటీవల ఈ కుటుంబసభ్యులంతా నెల్లూరులో ఓ శుభకార్యానికి వెళ్లారట. వారితో పాటు ఈ ఉడుతను కూడా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులతో ఉడుత చేసే సందడి చూసి తోటి ప్రయాణికులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారలట.. అంతే కాదు దానితో సెల్ఫీలు కూడా దిగారట. మూగ జీవి తమతో జీవించడం దేవుడిచ్చిన వరమేనని వీళ్లు అంటున్నారు. వీళ్ల టీ కొట్టుకు వచ్చే వాళ్లు కూడా ఉడుతతో ఆడుకుంటూ కాసేపు కాలక్షేపం చేస్తున్నారు.