వినాయక చవితి పండగను దేశమంతటా ఎంతో ఘనంగా నిర్వహించారు. సినిమా సెట్టింగ్ లను తలపించేలా గణనాధుడి మండపాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా వినాయక చవితి పూజలు ఎంతో ఆడంబరంగా జరుగుతోన్నాయి. అదే విధంగా నగరంలో పలు చోట్ల అప్పుడే నిమజ్జనం కూడా చేస్తున్నారు. అయితే వాహనం ఎక్కి వినాయకుడు నిమజ్జనానికి తరలడం కాదు.. నిమజ్జన వాహనమే ఇంటి ముందుకు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సరికొత్త విధానానికి ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ నాంది పలికింది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ లో భాగంగా ఫ్రీడమ్ ఆయిల్ సంస్థ ఆధ్వర్యంలో ‘ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం’ వాహనాలు మూడు అందుబాటులోకి వచ్చాయి. ప్రయోగాత్మకంగా తొలిసారి కమ్యూనిటీ అపార్ట్ మెంట్ల నివాసితులకు ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం వాహనాలను శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాహనాలపై ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో వినాయకుడి విగ్రహాన్ని మంత్రి నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంటి ముందే గణనాధుడు నిమజ్జనం చేయండ అన్నది మంచి ఆలోచన అని తెలిపారు. నిమజ్జనం చేసేవిధంగా వాహనాలను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తులో ఈ వాహనాలను మరిన్ని ప్రారంభించేలా చర్యలు తీసుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఫుడ్ చైర్మన్ రాజీవ్‌సాగర్, ఫ్రీడమ్ ఆయిల్ అధికారులు పాల్గొన్నారు. మరి.. ఇంటి ముందుకే నిమజ్జన వాహనాలు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి