తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. జన్మనిచిన తల్లిదండ్రుల స్థానం అలాంటిది. వారి తరువాతే ఎవరైనా. కని, పెంచి, విద్యా బుద్దులు నేర్పి.. వాళ్ళు మనల్ని ప్రయోజకులు చేస్తారు. ఈ క్రమంలో వారు మనం కోసం తమ ఆనందాలన్నిటిని త్యాగం చేస్తారు. పైసా.. పైసా.. దాచి బిడ్డలకి ఆస్తిని అందించాలని నానా కష్టాలు పడుతారు. ఇలా జీవితాంతం బిడ్డల అభ్యున్నతి కోసమే పరితపిస్తుంటారు. ఇంతా చేసి.., వారు కోరుకునేది ఒక్కటే. బిడ్డల నుండి ప్రేమ. వృద్ధాప్యంలో తమని కంటికి రెప్పలా కాపాడుతారని వాళ్ళ ఆశ. నిజానికి ఆస్తులు ఇచ్చినా, ఇవ్వకున్నా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది. కానీ.., కొంతమంది మాత్రం అమ్మ నాన్న దగ్గర ఆస్తి లేదు అంటూ.., వారిని వృద్ధాప్యంలో పట్టించుకోవడం లేదు. అయితే.., ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇంతకు మించిన సంఘటన.
తనకి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి నాలుగు కోట్ల రూపాయలు ఆస్తి పంచాను. అయినా.., ఇప్పుడు వాళ్ళు నాకు అన్నం పెట్టడం లేదు. పైగా.., ఉంటున్న ఇంట్లో నుండి బయటకి పంపాలని చూస్తున్నారు అంటూ ఓ తండ్రి ఆందోళనకి దిగిన ఘటన ఇది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఓ వృద్ధుడు ఆందోళనకు దిగాడు. ఇంటి ముందు టెంట్ వేసుకుని ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నాడు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొత్తకొండ స్వామి భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. అప్పటినుంచే తానే స్వయంగా వంట చేసుకుని తింటున్నాడు. ఇద్దరు కుమారులకు చెరో రెండు కోట్ల ఆస్తిని పంచి ఇచ్చాడు స్వామి. పెద్ద కుమారుడికి అవసరం ఉంటే 10 లక్షలు అప్పు కూడా తీసుకువచ్చి ఇచ్చాడు.
ఇప్పుడు ఆ అప్పు కట్టమని పెద్ద కుమారుడిని అడిగితే ఇల్లు తన పేరిట రాయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆ తండ్రి వాపోయాడు. వారు అన్నం పెట్టక, ఉంటున్న ఇల్లు వారి పేరు మీద రాస్తే నేను ఎక్కడికి పోవాలన్నది కొత్తకొండ స్వామి ఆందోళన. నేను పంచిన ఆస్తులను అడగడం లేదు, కొడుకులను నన్ను చాకమని అడగడం లేదు. అప్పుగా తీసుకొచ్చిన 10 లక్షలు చెల్లించమంటున్నా. ఈ వయసులో నేను అంత డబ్బు సంపాదించలేను. అలా అని ఇల్లు ఎవ్వరికీ రాసివ్వలేను. కాబట్టి.., తన కొడుకు కోసం తెచ్చిన అప్పుని, అతని చేత తిరిగి చెల్లించేలా చేయాలని గ్రామంలో పెద్ద మనుషులను ఆశ్రయించాడు కొత్తకొండ స్వామి. పైగా.., ఈ విషయంలో తాను ఎవరి మాట వినని..,పెద్ద కుమారుడు పది లక్షల అప్పు తీర్చే వరకు నిరాహర దీక్ష కొనసాగిస్తానంటున్నారు కొత్తకొండ స్వామి. పరుల సొమ్ముకి ఆశ పడే ఇలాంటి కొడుకులను కన్నందుకు సిగ్గుపడుతున్నా అంటూ కొత్తకొండ స్వామి కన్నీరు పెట్టుకోవడం గ్రామస్థులను సైతం కదిలించి వేస్తోంది.