సృష్టిలో అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే… నవమాసాలు ఎన్నో బాధలకు ఓర్చి మనకు జన్మనిస్తుంది. మనకు ఏ చిన్న బాధ కలిగినా ఆమె కంటి నుంచి కన్నీరు వస్తుంది. తన పిల్లలు ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని ఎప్పుడూ దేవున్ని ప్రార్థిస్తుంది. తన పిల్లలకు ఏ చిన్న ప్రమాదం జరిగినా విల విలలాడిపోతుంది. మంచి విద్యాబుద్దులు చెప్పించి సమాజంలో తమ పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలని నిరంతరం ఆరాటపడుతుంది. ఉన్నతస్థాయికి చేరుకొని తమ కష్టాలను తీరుస్తాడని సంతోషంలో ఉన్న తల్లి తన కొడుకు చనిపోవడంతో కన్నీరు మున్నీరైంది. ఆ తల్లి ఆవేదన.. రోదన చూసిన గ్రామస్థులు సైతం కంటనీరు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా నీల్వాయి గ్రామానికి చెందిన పున్యపు రెడ్డి మధుకర్, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు సాయికుమార్, కూతురు పల్లవి. చిన్నప్పటి నుంచి సాయి కుమార్ చదువుల్లో ఫస్ట్ ఉండేవాడు.. దాంతో తల్లిదండ్రులు తమ కొడుకు చదువు విషయంలో మరింత శ్రద్ద తీసుకునేవారు. పదవ తరగతి, ఇంటర్ లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు సాయికుమార్. ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో సాయి కుమార్ తండ్రి మధుకర్ కన్నుమూశాడు. దాంతో ఇద్దరు పిల్లలను రాజేశ్వరి ఎంతో కష్టపడి చదివిస్తుంది. తన కొడుకు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి తమ కష్టాలు తీరుస్తాడని ఎంతో ఆశపడింది.
చిన్నప్పటి నుంచి తల్లి కష్టాలు చూస్తూ పెరిగిన సాయికుమార్ కష్టపడి ఢిల్లీలో ఐఐటీ పూర్తి చేసి ఇటీవల బాచ్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. తన కుటుంబానికి అండగా నిలవాలని చూసిన సాయి కుమార్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో బెంగుళూర్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడు. సాయి కుమార్ ని కుటుంబ సభ్యులు, బంధువుల సహకారంతో నీల్వాయికి తరలించారు. చిన్నప్పటి నుంచి తన కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకొని మంచి వృద్దిలోకి వస్తాడని భావించిన ఆ తల్లి కలలు కల్లలు అయ్యాయి. పుట్టెడు దుఃఖంతో రాజేశ్వరి తనయుడి కి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు చేసింది. తల్లి ఆవేదన చూసి గ్రామస్థులు సైతం కంటతడి పెట్టుకున్నారు.