అమ్మ అనేది నెవర్ ఎండింగ్ ఎమోషన్. తొమ్మిది నెలలు మనల్ని పురిటిలో మోసి, ఆ తర్వాత జీవితాంతం మనకు ప్రతి కష్టంలోనూ తోడుండే ఆమె కోసం ఏమైనా చేస్తాం. ఎంతవరకైనా వెళ్తాం. ఇప్పుడు మేం చెప్పే రియల్ స్టోరీలోనూ అలాంటిదే జరిగింది. ఏకంగా తన తల్లి కోసం ఓ కొడుకు 30 ఏళ్లుగా న్యాయపోరాటం చేశాడు. వేరే లాయర్స్ అయితే న్యాయం ఎప్పటికి జరుగుతుందో అని సంశయించి, స్వయంగా తానే న్యాయవాది వృత్తిలోకి వచ్చాడు. చివరకు ఆమె సమస్యని పరిష్కరించాడు. వింటుంటేనే సినిమాను తలపిస్తున్న ఈ విషయం.. తెలంగాణలోనే జరిగింది. మొత్తం వింటే ఆ కుమారుడికి మీరు కూడా హ్యాట్సాప్ చెబుతారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నారు గ్రామానికి చెందిన సులోచనకు వరంగల్ కి చెందిన పాము సోమయ్యతో 1971లో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు కొడుకులు శరత్ బాబు, రాజా రవికిరణ్. కొన్నాళ్లపాటు వీరి సంసారం ఎలాంటి కలతలు లేకుండా సాఫీగానే సాగింది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగాయి. తరచూ గొడవలు జరిగేవి. పెద్దమనుషులు కల్పించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా సరే ఫలితం లేకుండా పోయింది. దీంతో కోర్టుని ఆశ్రయించగా.. 1992లో విడాకులు మంజూరు చేశారు. దీంతో ఇద్దరు కుమారుల్ని తీసుకుని.. సులోచన పుట్టింటికి వెళ్లిపోయారు. అక్కడే కొడుకుల్ని పెంచి పెద్ద చేశారు.
విడాకులు తీసుకున్న తర్వాత భర్త నుంచి భరణం ఇప్పించాలని సులోచన వరంగల్ కోర్టులో కేసు వేశారు. 1997లో ఈమెకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ వారికి లాయర్ సరైన సమాచారం ఇవ్వలేదు. శరత్ బాబు.. పలుమార్లు న్యాయవాది దగ్గరకు వెళ్లినప్పటికీ ఫలితం శూన్యం. దీంతో తల్లికి న్యాయం జరగాలంటే లాయర్లు నమ్ముకుంటే కుదరనుకుని.. తానే లాయర్ కావాలని నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా.. మొదట్లో ఓ ప్రైవేట్ జాబ్ చేశాడు. 2019లో ఎల్ఎల్ బీ పూర్తి చేసి న్యాయవాది వృత్తిలోకి వచ్చారు.
తల్లి సులోచనకు సంబంధించిన కోర్టు తీర్పుని గతేడాది ఆగస్టులో శరత్ బాబు సంపాదించారు. దాన్ని తీసుకుని తొలి కేసుగా.. తన తల్లికి భరణం ఇప్పించాలని కోరుతూ కోర్టులో కేసు వేశారు. ఈ వివాదం లోక్ అదాలత్ లో పరిష్కారం కావడంతో.. దాదాపు 30 ఏళ్ల తర్వాత సులోచనకు విడాకుల విషయంలో న్యాయం జరిగింది. ఆమె భర్త సోమయ్య.. నెలకు రూ.30 వేలు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక తల్లికి వచ్చిన కష్టం తీర్చేందుకు లాయర్ అయి, కోర్టులో కేసు వేసి అనుకున్నది సాధించిన కుమారుడు శరత్ బాబు పట్టుదల చూసి నెటిజన్లు హ్యాట్సాప్ చెబుతున్నారు. ఈయనే రియల్ హీరో అని.. ప్రతి తల్లికి ఇలాంటి కొడుకు ఉంటే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని అంటున్నారు.