మహనీయుల విగ్రహం పెడితే ప్రజాధనం వృధా అవుతుందని కొంతమంది చదువుకున్న నిరక్షరాస్యులు కామెంట్లు చేస్తున్నారు. ఇంత చీప్ గా ఆలోచిస్తారా? ఆయన గురించి తెలిసే కామెంట్స్ చేస్తున్నారా? లేక తెలియక కామెంట్స్ చేస్తున్నారా? ఏదైతే అది అయ్యింది, ఇచ్చి పడేద్దాం రండి.
ఏప్రిల్ 14, ఈ దేశానికి వెలుగు ప్రసాదించడానికి ఒక రవి కిరణం జన్మించిన రోజు.. అణగారిన వర్గాలకు వరమిచ్చేందుకు ఒక ఆశాకిరణం భూమ్మీద అడుగుపెట్టిన రోజు. డాక్టర్ బీమ్ రావు రామ్ జీ అంబేద్కర్ ఈ పేరే ఒక మహా విశ్వం. ఈయన పేరు తలచుకుంటే చాలు నిరాశ, నిస్పృహతో ఉన్న వారికి పూనకాలు వచ్చేస్తాయి. ఈ దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడు. తనను ఒక అణువులా ఎంత తొక్కిపెట్టాలని చూసినా పరమాణువులా అందనంత ఎత్తుకు ఎదిగిన మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే దాన్ని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనం వృధా అవుతుంది అని అంటున్నారు.
అసలు ఆయన చేసిన త్యాగానికి 125 అడుగుల విగ్రహమే తక్కువ అనుకుంటుంటే.. విగ్రహం ఎందుకు అని అంటున్నారంటే ఎంత మూర్ఖులో అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయి పటేల్ విగ్రహం నిర్మించినప్పుడు కూడా ఇలానే గోల చేశారు, ప్రజల సొమ్ము వృధా అవుతుంది అని. ఏదో నామమాత్రంగా రాజకీయాల్లోకి వచ్చేసి మొక్కుబడిగా నాలుగు హామీలు నెరవేర్చేసిన వాళ్ళకే విగ్రహాలు పెట్టగా లేనిది.. ఈ దేశం తలెత్తుకునేలా చేసిన మహనీయుల విగ్రహాలు కడితే తప్పా? అదేమైనా నేరమా? ప్రజాధనం దుర్వినియోగమా? ఇంకా మన డబ్బు ఈ బృహత్కార్యంలో భాగమైనందుకు సంతోషించాలి. ఆ మహనీయుడి గురించి పొరుగు దేశం నుంచి, ఇతర దేశాల నుంచి వస్తే తెలియద్దా? మనుషులంతా ఒకటే అని చెప్పిన సిద్ధాంతం తెలియద్దా? వివక్ష నుంచి విప్లవం, ఆపై విజయం వైపు, అదఃపాతాళం నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మహానుభావుడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడే అలాంటి ఆయన ప్రతిరూపం నగరం నడిబొడ్డున ఉండడం మన అదృష్టం.
ఉచిత పథకాల పేరుతో బోలెడంత డబ్బు దుర్వినియోగం అయినప్పుడు లేవని నోరు, ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బు పంచుతుంటే లేవని నోరు, పాలకులు పథకాలకు పెట్టే డబ్బు కంటే ప్రచారానికి పెట్టే డబ్బే ఎక్కువైనప్పుడు లేవని నోరు.. ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెడితే డబ్బు దుర్వినియోగం అవుతుందని గింజుకుంటున్నారు. అయ్యా ముందు రాజకీయ నాయకులకు, మహనీయులకు తేడా తెలుసుకోండి. రాజకీయ నాయకుల్లో 100 శాతం పూర్తిగా స్వచ్ఛత ఉండదు గానీ నూటికి నూరు శాతం స్వచ్ఛత కలిగిన మహనీయులు మన అంబేద్కర్, సర్దార్ వల్లభభాయి పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు.
అంబేద్కర్ విగ్రహానికి అయిన ఖర్చు రూ. 150 కోట్ల కంటే తక్కువే. ఈ దేశంలో ఒక పెద్ద హీరో తీసుకునే పారితోషికం కంటే అంబేద్కర్ గారి విగ్రహానికి అయిన ఖర్చు తక్కువ. ఏ మీ డబ్బును దోచుకుని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడని ఏ స్టార్ హీరోని అయినా ప్రశ్నించారా? ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని అన్నారా? కాసేపు నవ్వించే హీరోలను జీవితాంతం భుజాల మీద వేసుకుంటే.. తమ వ్యక్తిత్వంతో, తమ త్యాగాలతో ఈ దేశ భవిష్యత్తును నడిపించే రియల్ హీరోలు, మహనీయులను ఎన్ని జీవితాలు మనం భుజాల మీద వేసుకోవాలి. జన్మజన్మలకు భుజాల మీద వారి కీర్తిని, త్యాగాలను మోయాల్సిందే.
ఈ మాట ఈ దేశం మీద, మట్టి మీద మమకారం ఉన్న వ్యక్తులు అంటున్న మాట. సామాన్యులు అంటున్న మాట. అంబేద్కర్ విగ్రహం కడితే డబ్బు దుర్వినియోగం కాదు, కోట్లిచ్చినా రానటువంటి స్ఫూర్తి ఆయనను చూసినప్పుడు వస్తుంది. ఆఖరిగా ఒక్క మాట.. ఆయన ఈ దేశంలో ఎంతోమందికి దేవుడు. దేవుడు విగ్రహాన్ని పెడితే అడ్డుచెప్పకూడదు. ఇవాళ అందరం సుఖంగా ఉంటున్నామంటే దానికి ఆయన ప్రసాదించిన భిక్షే కారణం. ఆఖరికి ఆయన విగ్రహం అవసరమా అనే స్వేచ్ఛ కూడా ఆయన కల్పించిందే. దేవుడు వరమిచ్చాడు కదా అని ఆ వరాన్ని దేవుడు అంతు చూసేందుకు ప్రయోగిస్తే.. అంతం తప్పదని తెలుసుకోవాలి. మరి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం మీకు గర్వకారణమేనా? కాదా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.