ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక పరిస్తితి కూడా తలకిందులైంది. ఆర్థిక మాంద్యం కారణంగా ఎన్నో దిగ్గజ కంపెనీలు వేల మంది ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించివేశారు. ముఖ్యంగా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వరుస షాక్ లు ఇస్తున్నాయి.
కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా బడా కంపెనీల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ఆర్థిక మాంద్యం భయాలతో పలు దిగ్గజ కంపెనీలు ముఖ్యంగా ఐటీ, టెక్ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నారు. దీంతో ఐటీ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎప్పుడు తమ ఉద్యోగాలు పోతాయో అన్న భయంతో బిక్కు బిక్కుమంటున్నారు. ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ జరుగుతున్న తరుణంలో.. హైదరాబాద్ గచ్చీబౌలి లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఏకంగా బోర్డు తిప్పేసింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న 700 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఆ కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ గచ్చీబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈ మేరకు ఉద్యోగులను తీసివేస్తున్నట్లు కంపెనీ వారికి మెయిల్ పంపింది. దీంతో ఆయోమయంలో పడ్డ ఉద్యోగులు గచ్చిబౌలి లోని ఇన్ఫోఫీ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ కంపెనీలో 700 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారంతా ఒక్కసారిగా రోడ్డున పడ్డామని లబో దిబో అంటున్నారు. గత ఏడాది నుంచి సంస్థ జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. దారుణమైన విషయం ఏంటంటే.. ఈ కంపెనీలో 650 మంది పేరుతో రూ.4 లక్షల చొప్పున.. 50 మంది పేరుతో రూ.10 లక్షల చొప్పున సంస్థ లోన్ తీసుకున్నట్లు తెలిసింది.
ఉద్యోగాల్లో చేరినప్పటి నుంచి జీతాలు ఇవ్వకుండా తమకు సాలరీ కింద మీ లోన్ కడుతున్నామని కంపెనీ చెప్పుకుంటూ వచ్చిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు అడిగినప్పుడల్లా మీ ట్రైనింగ్ ఇంకా పూర్తి కాలేదు అంటూ బుకాయిస్తూ వచ్చిందని అన్నారు. ఉద్యోగాలు తొలగించి బోర్డు తిప్పేయడంతో తమ భవిష్యత్ ఏంటని ఉద్యోగులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒక్కసారే కంపెనీలో 700 మంది ఉద్యోగాలు పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఉద్యోగుల పేరుతో కంపెనీ తీసుకున్న అప్పులు ఎవరు చెల్లించాలనే ప్రశ్న ఉద్యోగుల్లో మరింద ఆందోళన కలిగిస్తుంది.