తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు ప్రజలకు అందించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు సర్జరీలు ఉచితంగా చేసి పేదల ప్రాణాలను కాపాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు.
ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు కిడ్నీ మార్పిడి చేసి కొంతమంది ప్రాణాలు కాపాడారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేసి రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. తాజాగా ఓ ఆరేళ్ల బాలునికి పునర్జన్మను ప్రసాదించి వైద్యో నారాయణో హరి అనే నానుడిని నిజం చేశారు ఉస్మానియా డాక్టర్లు. ఆరేళ్ల బాలుడు సాయి ప్రణీత్‌కు సర్జరీతో లివర్ మార్పిడి చేసి అందరి మన్ననలు పొందుతున్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింది రూ.30 లక్షల సర్జరీని ఉచితంగా చేసి బాబు ప్రాణాలను కాపాడారు. దీనికి సంబంధించి ఆస్పత్రి సూపరింటెండెట్ డాక్టర్ నాగేందర్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు డా. మధుసూదన్, అనస్థీషియా విభాగం వైద్యులు డా. పాండునాయక్ పూర్తి వివరాలను వెల్లడించారు.
పర్వతపురం సాయిప్రణీత్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందినవాడు. ఈ అబ్బాయి చిన్నప్పటి నుండే లివర్ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స నిమిత్తం గత నెలలో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని తెలిపారు. దీనికి సాయి ప్రణీత్ తండ్రి లివర్ దానం చేసేందుకు ముందుకు వచ్చాడు. తండ్రి లివర్‌లోని 250 గ్రాములను తీసి ప్రణీత్‌కు సర్జరీ చేసి అమర్చారు. ఆపరేషన్ విజయవంతం అయింది.
ఉస్మానియాలో ఇప్పటివరకు 720 కిడ్నీ, 23 లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ నిర్వహించామని డా. నాగేందర్ వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.30 లక్షల వరకు ఖర్చయ్యే శస్త్రచికిత్సను ఉస్మానియాలో ఉచితంగా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో సాయిప్రణీత్ కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ అనంతరం సాయిప్రణీత్, అతని తండ్రి కోలుకుంటున్నారు.