ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి. ఏడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నేడు విగ్రహం ఆవిష్కరణ చేయనున్నారు. మరి ఆ విగ్రహం విశేషాలు, ప్రత్యేకతలు ఇవే..
భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 14కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. భారత రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పుట్టిన రోజు. నేడు సమాజంలో మనం అనుభవిస్తోన్న హక్కులు, అధికారాలు, రాజ్యాధికారం వంటివి అంబేద్కర్ కారణంగానే లభించాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి మహనీయుడిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఇక అంబేద్కర్ గౌరవార్థం.. తెలంగాణ ప్రభుత్వం.. అంబేద్కర్ భారీ విగ్రహ నిర్మాణం చేపట్టింది. 2016 ఏప్రిల్ 14న అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగులు భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆమేరకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విగ్రహ నిర్మాణం చేపట్టింది. నేడు అనగా అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం రోజున ఈ భారీ విగ్రహం ఆవిష్కారం కాబోతుంది.
హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ తీరాన.. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అతిపెద్ద కాంస్య విగ్రహం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ విగ్రహం గురించే చర్చించుకుంటున్నారు. దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహంగా నిలిచిన ఈ విగ్రహం ప్రత్యేకతలు, విశేషాలు ఇలా ఉన్నాయి. ఈ భారీ విగ్రహ నిర్మాణాన్ని.. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో దాదాపు 11.80 ఎకరాల స్థలంలో చేపట్టారు. విగ్రహం ఎత్తు 125 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు. ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, వెడల్పు 172 అడుగులు ఉంది. మెుత్తంగా భూమి నుంచి లెక్కిస్తే.. స్మారకం ఎత్తు 175 అడుగులు. ఇది దేశంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహంగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
ఈ విగ్రహాన్ని పార్లమెట్ భవనంలో నమూనాలో ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. విగ్రహానికి సంబంధించిన డీపీఆర్‌ను ఢిల్లీలోని రాంసుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మత్తురామ్ ఆర్ట్స్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు చెందిన శిల్పుల పర్యవేక్షణలో రూపొందించారు. ఇక విగ్రహ నిర్మాణం కోసం తెలంగాణ ఎస్సీ సంక్షేమ శాఖ 2020, సెప్టెంబర్ 16న రూ.146.5 కోట్లు మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. 2021, జూన్ 6న ఒప్పందం చేసుకుని.. 12 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించింది.
విగ్రహంం నిర్మాణాన్ని.. పార్లమెంట్ ఆకారంలో రెండు ఎకరాల్లో పీఠం నిర్మాణం చేపట్టారు. పీఠం లోపల స్మారక భవనంలో 27,556 అడుగుల నిర్మిత స్థలం ఉంది. ఇందులో ఒక లైబ్రరీ, మ్యూజియం, జ్ఙాన మందిరం, అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలతో కూడిన ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. భవనం లోపల ఆడియో విజువల్ రూమ్స్ ఉన్నాయి. అలానే లోపల ఏర్పాటు చేసిన లైబ్రరీలో అంబేద్కర్ రచనలు సహా ఆయన జీవితానికి సంబంధించి పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. 2.93 ఎకరాల్లో థీమ్ పార్కుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటు రాక్‌గార్డెన్, వాటర్ ఫౌంటేన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్‌శాండ్ స్టోన్ వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక స్మృతివనంలో దాదాపు 450 వరకు కార్లను నిలిపేలా పార్కింగ్ ప్లేస్ ఉంది.
రూ.146.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టిన ఈ భారీ అంబేద్కర్ విగ్రహం బరువు 465 టన్నులు ఉంటుంది. దీని కోసం 96 టన్నుల ఇత్తడి, 791 టన్నుల స్టీల్ వాడారు. ఇక విగ్రహ నిర్మాణ బాధ్యతను కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు. విగ్రహ భాగాలను ఢిల్లీలో రూపొందించి.. ఆ తర్వాత వాటిని హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం భారీ క్రేన్‌ల సహాయంతో విగ్రహ విడిభాగాలను క్రమపద్ధతిలో అమర్చారు. భూకంపాలు, భారీ గాలులు, వర్షాలు ఇలా అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా విగ్రహాన్ని నిర్మించారు. ఇందుకోసం ప్రతి రోజు 425 మంది కూలీలు పనిచేశారని చెప్పుకొచ్చారు.
ఇంత భారీ విగ్రహ నిర్మాణం చేప్టటడం ఒక ఎత్తయితే.. మనం అనుకున్న రీతిలో.. ఎక్కడా లోపం లేకుండా.. విగ్రహాన్ని రూపొందించే శిల్పిని పట్టుకోవడం మరో ఎత్తు. మరి ఆ శిల్పి ఎవరు అంటే.. ఆయనే మహారాష్ట్రలోని ధూలె జిల్లాలోని గోండూరు గ్రామానికి చెందిన రామ్ వి సుతార్ ఈ భారీ విగ్రహం రూపొందించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి నిదర్శనంగా గుజరాత్‌లోని నర్మదా నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తయారు చేసింది కూడా ఈయనే. రామ్ వి సుతార్, ఆయన తనయుడు అనిల్ సుతార్ ఈ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని డిజైన్ చేశారు. 2016 ఏప్రిల్ 14న ఈ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా… వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ.. ఏడేళ్ల తర్వాత నేడు ( ఏప్రిల్ 14న 2023) విగ్రహం ప్రారంభం కానుంది.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం తెలంగాణ సర్కార్ రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా.. అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌ను ఆహ్వానించారు. విగ్రహ ప్రారంభోత్సవం బౌద్ధ సంప్రదాయంలో చేస్తారు. కారణం అంబేద్కర్ తన జీవితం చివరి రోజుల్లో బౌద్ధం స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇక విగ్రహావిష్కరణలో భాగంగా సీఎం కేసీఆర్ ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 30 మంది బౌద్ధగురువులు సీఎంను ప్రార్థనలతో విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. తర్వాత స్తూపం లోపల ఉన్న లిఫ్టులో కేసీఆర్ అంబేడ్కర్ విగ్రహం పాదాల వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు.
విగ్రహావిష్కరణ సందర్భంగా పలు రకాల పుష్పాలతో.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సరిపోయేంత భారీ పూలమాలను.. ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. దాన్ని క్రేన్ సాయంతో అంబేడ్కర్ మెడలో వేయనున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా విగ్రహం మీద పూలవర్షం కురిపిస్తారు. విగ్రహా ఆవిష్కరణకు భారీ సంఖ్యలో జన సమీకరణ కూడా చేస్తున్నారు. వారికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు హాజరయ్యేలా 750 బస్సులను ఆయా ప్రాంతాలకు పంపే ఏర్పాట్లు చేసింది ఆర్టీసీ.
దాదాపు 50 వేల మంది కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు ఏర్పాటు చేశారు. రెండు లక్షల మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, 80 వేల స్వీటు ప్యాకెట్లు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విగ్రహావిష్కరణ చేస్తారు. అనంతరం సీఎం కేసీఆర్ సభలో ప్రసంగించనున్నారు. భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.