రాష్ట్రంలోని ఓ జిల్లా కలెక్టరేట్లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. అడిషనల్ కలెక్టర్‌తో పాటు మరో ఇద్దరిని కుక్కలు తీవ్రంగా కరిచాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
తెలంగాణలో వీధి కుక్కల బెడద రోజురోజుకీ ఎక్కువవుతోంది. రాజధాని హైదరాబాద్‌లోని అంబర్ పేటలో బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన తెలిసిందే. ఆ దాడిలో బాలుడు చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో చోట్ల వీధి కుక్కల అటాక్స్ జరిగాయి. చాలామటుకు పిల్లలపై ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. అయితే కొన్ని ఘటనల్లో పెద్దవారి పైనా స్ట్రే డాగ్స్ అటాక్ చేశాయి. ఇదిలాఉండగా.. సిద్ధిపేట కలెక్టరేట్లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. అదనపు కలెక్టర్ (రెవెన్యూ శాఖ) శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని వీధి కుక్కలు తీవ్రంగా కరిచాయి.
వీధి కుక్కల దాడిలో కలెక్టర్ పెంచుకుంటున్న కుక్క కూడా తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించిన విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సిద్ధిపేట శివారులో కలెక్టరేట్‌తో పాటు అధికారుల ఇళ్లు కూడా ఉన్నాయి. శనివారం రాత్రి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తాను నివాసం ఉంటున్న క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తుంగా ఒక వీధి కుక్క కరిచింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో ఉంచి శ్రీనివాస్‌ను పరిశీలనలో పెట్టారు. ఇంకో వీధికుక్క అదేరోజు రాత్రి మరో వ్యక్తిని, కలెక్టర్ పెంపుడు కుక్కను కరిచింది. కలెక్టరేట్‌కు దగ్గర్లోని పౌల్ట్రీఫాం వద్ద కూడా ఒక బాలుడు కుక్కకాటుకు గురయ్యాడు.