హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి నగరవ్యాప్తంగా కొన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అవి ఏంటి.. ఎందుకు ఆంక్షలు అంటే..
భాగ్యనగర వాసులకు అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. నగరంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి.. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అంతేకాక.. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూతపడనున్నాయి. ఈ క్రమంలోని హైదరాబాద్‌లోని గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, పీఎన్‌వీఆర్‌ఎక్స్‌ప్రెస్ వే, లంగర్ హౌస్ ఫ్లైఓవర్ మినహా నగరంలోని మిగతా అన్ని ఫ్లైఓవర్లను మంగళవారం రాత్రి నుంచి మూసివేయనున్నారు. అలానే నెక్లెస్ రోడ్, పీవీఎన్‌ఆర్ రోడ్డులో కూడా వాహనదారుల రాకపోకలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరి ఫ్లైఓవర్‌లను ఎందుకు మూసి వేస్తున్నారు అంటే..
‘షాబ్-ఈ-ఖాదర్’ జగ్నే కీ రాత్ సందర్భంగా మంగళవారం రాత్రి 10 గంటల నుంచి హైదరాబాద్ నగరంలోని ఫ్లైఓవర్లపై రాకపోకలు నిలిపివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు, వాహనదారులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరుతూ.. మీడియాకు ప్రకటన విడుదల చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఏవైనా సమస్యలు ఉంటే 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. షాబ్-ఈ-ఖాదర్ జగ్నే కీ రాత్ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందుస్తు జాగ్రత్త చర్యగా ఫ్లైఓవర్లను బంద్ చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
‘షాబ్-ఈ-ఖాదర్’ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా పోలీసులు నగరంలో.. ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నారు. అయితే చంద్రుని దర్శనాన్ని బట్టి రంజాన్ పండుగ ఏ రోజు అనేది ముస్లిం మత పెద్దలు నిర్థయిస్తారు. నెలవంకను బట్టి ఏప్రిల్ 22 లేదా 23న రంజాన్ పండుగను జరుపుకునే అవకాశముంది. ఇస్లాం ప్రకారం పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారంను అత్యంత పవిత్రమైనదిగా ముస్లిం సోదరులు భావిస్తారు. ఆ రోజు రాతంత్రా జగారం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇక ప్రజలు ఆంక్షలను పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లైఓవర్ల బంద్ కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
మరోవైపు ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు ఉప్పల్ స్టేడియంలో ముంబై వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ హైవే నుంచి వచ్చే వాహనాలను చెంగిచర్ల, చర్లపల్లి, ఎన్‌జీసీ వైపు మళ్లించనున్నారు. ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దాంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వచ్చే అభిమానులతో రోడ్డన్నీ జామ్ అవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో మ్యాచ్‌లు ఉన్న రోజుల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు. అలాగే స్టేడియంకు వచ్చే ప్రేక్షకుల కోసం మెట్రో, టీఎస్‌ఆర్టీసీ అదనపు సర్వీసులను నడుపుతోంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అదనపు సర్వీసులు నడుపుతున్నారు.