తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూత పెట్టనుంది. ఇవాళ ఆ రైలు పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే ఈ రైలు టైమింగ్స్, టికెట్ ధరల వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల నడుమ రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కూత పెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సెమీ హైస్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో శనివారం (ఏప్రిల్ 8వ తేదీ) పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషనల్లో మాత్రమే ఆగుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా ఈ మార్గంలో టికెట్ల ధరలను రైల్వే శాఖ వెల్లడించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ట్రైన్.. మళ్లీ తిరుపతిలో మొదలై సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్-తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్ రూట్లలో టికెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఛైర్‌కార్ టికెట్ ధర రూ.1,680గా ఉంది. అదే సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు రూ.1,270, సికింద్రాబాద్ నుంచి ఒంగోలుకు రూ.1,075, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు రూ.865, సికింద్రాబాద్ నుంచి నల్గొండకు రూ.470గా దక్షణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఛైర్‌కార్‌కు ఎగ్జిక్యూటిక్ ఛైర్‌కార్‌కు ఛార్జీల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ టికెట్ ధర రూ.3,080గా ఉంది. అదే సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు రూ.2,455, సికింద్రాబాద్ నుంచి ఒంగోలుకు రూ.2,045, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు రూ.1,620, సికింద్రాబాద్ నుంచి నల్గొండకు రూ.900గా రైల్వే శాఖ నిర్ణయించింది.
టైమింగ్స్ విషయానికొస్తే.. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ (20701) సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ (20702) తిరుపతి స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఒక్క మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ రైలు సేవలు అందిస్తుంది. ఆ ఒక్కరోజు కూడా నిర్వహణ కోసం సెలవు ఉంటుంది.
వందే భారత్ రైలులో ఆహార పదార్థాల (టిఫిన్, భోజనం)తో పాటు న్యూస్ పేపర్స్ కూడా అందజేస్తారు. ఉదయం, సాయంత్రం ఫుడ్ మెనూను బట్టి ఆహారాన్ని అందిస్తారు. అయితే, టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్యాసింజర్ తనకు నచ్చిన ఆహార పదార్థాలను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆహారం వద్దనుకుంటే బేస్ ఛార్జీలు వర్తిస్తాయి. సికింద్రాబాద్-తిరుపతి మధ్య టికెట్ బేస్ ఫేర్‌ను రూ.1,168గా రైల్వే శాఖ నిర్ణయించింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ రైలులో బేస్ ధర రూ.1,169గా ఉంది. కేటరింగ్ ఛార్జీ రూ.308గా అధికారులు పేర్కొన్నారు.