కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్ పథకంపై’ దేశవ్యాప్తంగా భద్రతా దళాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారినుంచి వచ్చిన వ్యతిరేకత హింసాత్మక కాండలకు దారితీసింది. అగ్నిపథ్ పథకం ప్రకటించినప్పటి నుంచి దేశం అగ్ని గుండంలా మారిపోయింది. నిరసనలు తెలుపుతున్న ఆర్మీ ఉద్యోగార్థులంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మొదలు పెట్టారు.
ఆ అల్లర్లు, ఆందోళనలు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను తాకిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టడం, స్టాళ్లను ధ్వంసం చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేశ్(18) అనే యువకుడు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. సికింద్రాబాద్ నుంచి అన్ని రైళ్లను రద్దు చేశారు.
సికింద్రాబాద్ అల్లర్లు.. పక్కా పథకం ప్రకారమే జరిగాయంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శించారు. అగ్నిపథ్ పథకం గురించి అసత్య ప్రచారాలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలపై మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు.
వారి పథకాలు ఆ విశ్వగురువుకే తెలుస్తాయంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు అగ్నిపథ్ కింద వయోపరిమితిని కేంద్రం మరో రెండు సంవత్సరాలు పెంచింది. మొదట 17.5 నుంచి 21 సంవత్సరాలుగా నిర్ణయించగా ఆ తర్వాత గరిష్ట వయసు 23కి పెంచారు (ఈ ఏడాదికి మాత్రమే).
అగ్నిపథ్ కింద ఎయిర్ ఫోర్స్ లో జూన్ 24 నుంచి రిక్రూట్ మెంట్ మొదలు పెట్టనున్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన అల్లర్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అగ్నిపథ్ పథకంపై జరుగుతున్న అల్లర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.