తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల విషయంలు పలు సందర్భాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయకులకు సంబంధించిన ఆస్తుల వివరాలపై టీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం దీనికి సంబంధించిన పలు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొంత మంది ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని.. ముఖ్యంగా రియలెస్టేట్ వ్యాపారాలు, రాజకీయాలు అలాగే ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించడం లాంటివి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలపై తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లాకు చెందిన ఓ టీచర్ వ్యవహారంపై విజిలెన్స్ శాఖ వారు విచారణ చేపట్టారు.
ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థిర, చరాస్తుల క్రయ విక్రయాలు జరిపితే.. ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. వాటి వివరాలను మార్కెట్ ధర ప్రకారం వెల్లడించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ జీవోపై పెద్ద ఎత్తున టీచర్ల నుండి వ్యతిరేకత రావడంతో తెలంగాణ ప్రభుత్వం.. ఆస్తి ప్రకటనల ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.