ఉమ్మడి వ్యవస్థ నుండి న్యూక్లియర్ ఫ్యామిలీగా ఏర్పడిన తర్వాత కూడా సంబంధ, బాంధవ్యాలు విచ్ఛినమయ్యాయి. అన్నదమ్ములు, అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు మధ్య సంబంధాలు తెగిపోయాయి. చుట్టాలు, బందువుల మధ్య గొడవలే. అనుబంధాల మధ్య అల్లిన సినిమా బలగాన్నిచూసి అనేక కుటుంబాలు తిరిగి ఏకమౌతున్నాయి.
భారత దేశం వసుదైక కుటుంబం. కుటుంబ వ్యవస్థతో వెలుగులీనుతూ ఉండేది. అయితే మారుతున్న అవసరాలు, పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి కుటుంబం విఛ్చిన్నమైంది. బంధాలు, బంధుత్వాల మధ్య అడ్డుగోడలు మొదలయ్యాయి. అపార్థాలతో గొడవలు రాజ్యమేలయ్యాయి. దీంతో పరువు, ప్రతిష్ట అంటూ గిరి గీసుకుపోయారు. పగలు, ప్రతీకారాలతో రగిలిపోయారు. కయ్యానికి కాలు దువ్వుతూ మనశ్శాంతిని దూరం చేసుకున్నారు. ప్రాథమిక కుటుంబం ఏర్పడ్డాక కూడా ఎవ్వరికీ పొసగడం లేదు. అన్నదమ్ములు, అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు మధ్య సంబంధాలు తెగిపోయాయి. అయితే ఇటీవల వచ్చిన ఓ సినిమా అనేక మందిని ప్రభావితం చేసింది. అదే బలగం. బంధాలు, బంధుత్వంపై తీసిన ఈ సినిమాను చూసిన.. చాలా మంది.. పగలు మర్చిపోయి తోబుట్టువులతో మాట్లాడుతున్నారు. తాజాగా దాయాదుల కుటుంబాన్ని కలిపింది ఈ సినిమా.
15 సంవత్సరాలుగా పగతో ప్రతీకారాలతో రగిలి పోయిన ఎనిమిది మంది కుటుంబాలను కలిపింది ఈ సినిమా. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది. వివరాల్లోకెళితే.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మండలం మాసన్ పల్లి చెందిన 8 నాయి బ్రాహ్మణ కుటుంబాలు గతంలో ఓ గ్రామంలో కలిసి ఉండేవి. ఆ సమయంలో భూ తగాదాలు, ఇంటి స్థలాల గొడవలతో కొట్టుకునేవారు. పగలు ప్రతీకారాలతో మాటలు కరువయ్యాయి. కుటుంబ పరిస్థితులు బాగోలేక కొందరు హైదరాబాద్ వలస వెళ్లారు. అయినప్పటికీ ఒకరంటే మరొకరికి గిట్టదు. ముఖాలు కూడా చూసుకునే వారు కాదు. పిల్లలు సైతం పగలతో, కక్షతో రగిలిపోయేవారు. అయితే తాజాగా వీరంతా బలగం సినిమాను చూశారు. అందులోని గ్రామీణాల్లో పరిస్థితులను తమకు అన్వయించుకుని.. దు:ఖ సాగరంలో మునిగి తేలారు.
ఈ సినిమాను చూసి చలించి.. ఇన్ని రోజులుగా తాము చేసిన తప్పును తెలుసుకున్నారు. కలసి ఉంటే కలదు సుఖం అని తెలుసుకుని.. వారందరూ కలిసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా తమ స్వగ్రామం అయిన మాసన్ పల్లికి చేరుకున్నారు. దాయాదుల కుటుంబాల వారు, వారి పిల్లలు కలసి బలగం సినిమా గురించి చర్చించుకొన్నారు. పగలు, గొడవలు పక్కన పెట్టి కలిసుండాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం అందరూ కలిసి విందు చేసుకున్నారు. బలగం సినిమా తీసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. 8 కుటుంబాలకు చెందిన కలుసుకుని ఆనందంలో మునిగి తేలారు. ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.