తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా చెప్పుకునే సలేశ్వర జాతర నిన్నటి నుంచి ప్రారంభం అయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల సలేశ్వరం క్షేత్రంలో కొలువైన శివలింగం ఇత్తడితో చేసిన పడగమధ్యలో సలేశ్వరం లింగమయ్య కొలువుదీరి ఉంటాడు. స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తుతారు.
తెలంగాణలో ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. అందులో నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా చెప్పుకునే సలేశ్వర జాతర ఎంతో ప్రసిద్ధిగాంచింది. సలేశ్వర జాతర ఈనెల 5, 6,7 తేదీల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్.. శ్రీశైలం జాతీయ రహదారి 765 లోని మున్ననూరు తర్వతా ఫరహాబాద్ చౌరస్తా వస్తుంది.. అక్కడ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి మార్గంలో సలేశ్వరం క్షేత్రం ఉంది. ప్రతిఏట తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. తాజాగా సలేశ్వరం యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల సలేశ్వరం క్షేత్రంలో కొలువైన శివలింగం ఇత్తడితో చేసిన పడగమధ్యలో సలేశ్వరం లింగమయ్య కొలువుదీరి ఉంటాడు. స్వామిరి వారిని దర్శించుకోవడానికి చాలా వరకు భక్తులు ఇక్కడికి కాలినడకనే వెళుతూ ఉంటారు. ఈ మార్గంలో సరైన ఏర్పాట్లు లేవని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అప్పటికప్పుడు తూతూ మంత్రంగా ఏర్పాట్లు చేస్తుంటారని.. ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయని భక్తులు అంటున్నారు. తాజాగా సలేశ్వరం యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. లోయలో భక్తుల రద్దీ కారణంగా ఊపిరి ఆడక నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన గొడుగు చంద్రయ్య, వయసు 55 సంవత్సరాలు.. గుండెపోటుతో మృతి చెందగాడు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన అభిషేక్.. వయసు 32 సంవత్సరాలు ఊపిరి ఆడక చనిపోయాడు.
సాధారణంగా వారం పదిరోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.. అయితే అధికారులు మత్రం కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహిస్తామని ప్రకటించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రద్దీ ఎక్కువైంది. స్వామి వారి దర్శనానికి వస్తూ వస్తున్నాం లింగమయ్యా.. అంటూ శివనామస్మరణం తో నల్లమల అటవీ ప్రాంతం అంతా మారుమ్రెగుతుంది. ఈ క్రమంలోనే కొంతమంది ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చిన్న పిల్లలు ఉన్నవారు.. వృద్దులు ఈ రద్దీ చూసి స్వామి వారిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో భక్తులు మరింత పెరిగిపోయే అవకాశం ఉన్నందున.. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.