సాధారణంగా ఎక్కడైనా ఓ ప్రాంత అభివృద్ధి అనేది దానికి ఉన్న రహదారి సౌకర్యంపై ఆధారపడి ఉంటుంది. అలా చాలా గ్రామాల ప్రజలు మంచి రోడ్డు కోసం ప్రభుత్వాలకు ఎన్నో విజ్ఞప్తులు చేస్తుంటారు. ప్రభుత్వం సానుకూలం స్పందించి.. ఆ ప్రాంతాలకు రోడ్లు వేస్తే.. దాన్ని అక్కడి ప్రజలు అదృష్టంగా భావిస్తారు. అలాంటిది.. ఓ గ్రామం మీదుగా ఏకంగా హైవే మార్గం వెళ్తుంది. కానీ అక్కడి వారికి అది మృత్యుమార్గం. కారణంగా ఆ జాతీయ రహదారి నిత్యం ఆ ఊరిలోని మగవారిని బలి తీసుకుంటుంది. చివరికి ఆ ఊరి పరిస్థితి ఎలా మారిందంటే శుభకార్యం కోసం పక్క ఊరి నుంచి ముత్తైదువులను పిలిపించుకోవాల్సి వస్తుంది. అంటే అక్కడ ఉన్న ఆడవాళ్లు అందరు వితంతువులే. మరీ అంత దారుణంగా మారిన ఆ ఊరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారి 44వ నంబర్ జాతీయ రహదారి. ఇది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వెళుతుంది. ఇది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో పెద్దకుంట తండా మీదుగా వెళ్తుంది. NH-4 దేశంలో ఎంత పొడవైనదో ఈ ప్రాంతంలో దానిపై జరిగే ప్రమాదాల జాబితా కూడా అంతే పొడవైనదని స్థానికులు అంటున్నారు. ఇక్కడ 45 ఇళ్లు ఉంటే, అందులో 37 కుటుంబాలలో మగవారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పెద్దకుంటతాండ కు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ.. “ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. బయటకి వెళ్లిన మగవారు తిరిగి వచ్చే వరకు ఇంట్లోని వారు భయం భయంగా గడుపుతారు. నా భర్త, తండ్రి, అన్న ముగ్గురూ ఈ రహదారిపై జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో చనిపోయారు. ఇప్పుడు నా కొడుకే నాకు తోడు. మా ఊరి పరిస్థితి ఎలా ఉంటుందంటే.. ఈ ఊరిలో జరిగే శుభకార్యలకు వేరే ఊరినుంచి ముత్తైదువులను పిలిపించుకోవాల్సి వస్తుంది” అని వాపోయింది. ఎవరికైనా ఆరోగ్యం సమస్య వస్తే మందుల కోసం వెళ్లే మగవాళ్లు లేకుండా పోయారు. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి ఈ రహదారి దాటాల్సి వస్తుందని, వారి 10వ తరగతి వరకు ప్రభుత్వ వసతి గృహాల్లోనే ఉంచి చదివిస్తున్నారంట.
ఉన్నత చదువుల కోసం ఈ రోడ్డు మీదే వెళ్లి.. రావాల్సి వస్తుంది కదా. అలా వెళ్లే క్రమంలో ఏమైనా ప్రమాదం జరుగుతుందనే భయంతో చదువులు మానేసి అక్కడే పని చేసుకుంటున్నామని అక్కడి వారు తెలిపారు. సాయంత్రం వస్తానన్న మనిషి రాత్రైనా ఇంటికి రాలేదంటే, రోడ్డు మీద శవమై తేలాడా అనే సందేహంతో NH-44 పైకి పరిగెత్తుకెళ్లి చూసిన రోజులు ఎన్నో ఉన్నాయని ఇక్కడి వారు చెబుతున్నారు. ఆ విధంగా పెద్దకుంట తండాకు ఈ హైవే మృత్యుమార్గంగా మారింది. ఈ హైవే ప్రమాదాల వల్ల ఈ తండాకు ‘వితంతువుల తండా’ అని పేరు వచ్చింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.