ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రష్యా-ఉక్రెయిన్ మద్య జరగుతున్న యుద్దం గురించే మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాలు రష్యా అధ్యక్షులు పుతిన్ పై ఎంతగా వత్తడి తీసుకు వస్తున్నా.. ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికీ మూడు సార్లు చర్చలు జరిగినా అవి విఫలం అయ్యాయి. ఇదిలా ఉంటే.. యుద్దం మొదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో చికెన్ ధరలు డబుల్ అయ్యాయి. నెల క్రితం రూ.140 నుంచి రూ.160 వరకు పలికిన కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.300కి చేరింది.
తెలంగాణ రాష్ట్రాంలో చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. ఒక దశలో సామాన్యుడు చికెన్ తినలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అమాంతంగా చికెన్ ధరలు పెరగడానికి కారణం ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధమే కారణమని హ్యాచరీస్ యజమానులు పేర్కొంటున్నారు. కోళ్ల ఫారంలలో ఉపయోగించే దాణా రేటు పెరిగిపోవడం, ఫారాలలో కొత్త బ్రీడ్ ప్రారంభించకపోవడంతో ఉన్న కోళ్లతోనే నెట్టుకురావడం వంటి కారణాలు చికెన్ ధరలు పెరిగాయని అంటున్నారు. బ్రాయిలర్ కోళ్లకు ప్రధానంగా మొక్కజొన్న, సోయాబీన్‌ను ఆహారంగా ఇస్తారు. ప్రస్తుతం వీటి ధరలు విపరీతంగా పెరిగాయి.
నెల క్రితం సోయాబీన్ ధర కిలో రూ.40 ఉండగా, ఆ ధర ఇప్పుడు రూ.70కు పెరిగింది. అలాగే, కిలో మొక్కజొన్న ధర నెల క్రితం రూ.20 నుంచి ఉండగా, ఇప్పుడు రూ.27 కి పెరిగింది.. త్వరలో అది రూ.30 కి చేరే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మొక్క జొన్న, సోయాబీన్ ను ఉక్రెయిన్ అధికంగా పండిస్తోంది. రష్యాతో యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు మొక్కజొన్న, సోయాబీన్ ఎగుమతులు ఆగిపోవడంతో ఇక్కడ వాటి రేట్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సోయా, మొక్కజొన్నకు భారీ డిమాండ్ వచ్చింది.
మరోవైపు ఇండియా నుంచి ఇతర దేశాలకు సోయా, మొక్క జొన్న ఎగుమతులు ప్రారంభమయ్యాయి. తద్వారా ధరలు పెరిగిపోవడంతో, చికెన్ ధరలు కూడా ఆకాశాన్నంటాయని వెంకటేశ్వర హ్యాచరీస్ జనరల్ మేనేజర్ కేజీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి రాబోయే కొద్ది నెలల వరకు కొనసాగే అవకాశం ఉందని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ తెలిపింది. ధరలు పెరగడంతో ఆదివారం వస్తే రద్దీగా ఉండే నాన్-వెజ్ మార్కెట్లు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చికెన్ షాపుల వైపు వెళ్తే జేబుకి చిల్లు పడేలా ఉందని.. పలువురు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు.