బస్సులో ఒక మహిళకు పురిటినొప్పులు మొదలయ్యాయి. మహిళ ఆ నొప్పులను తట్టుకోలేక గిలగిలలాడుతుంటే.. ఆర్టీసీ సిబ్బంది మరో ఆలోచన లేకుండా బస్సును హాస్పిటల్‌కి తీసుకుపోయి ఆమె ప్రాణాలను కాపాడారు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లికి చెందిన సెగ్గం లహరి అనే మహిళ టెస్టుల కోసం పరకాల ఆసుపత్రికి వెళ్ళారు. పరీక్షించిన వైద్యులు డెలివరీకి 10 రోజులు సమయం ఉందని చెప్పడంతో ఆమె పోలంపల్లి బయలుదేరారు. పరకాల నుంచి పోలంపల్లికి ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. రేగొండ చేరుకునేసరికి లహరికి పురిటినొప్పులు మొదలయ్యాయి. అయితే నొప్పులు ఎక్కువ అవ్వడంతో ఆమె తట్టుకోలేకపోయారు.
ఈ విషయాన్ని కండక్టర్, డ్రైవర్‌కి చెప్పడంతో వారు బస్సును ఎక్కడా ఆపకుండా నేరుగా భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ మహిళను హాస్పిటల్‌లో చేర్పించగా పది నిమిషాల్లో వైద్యులు నార్మల్ డెలివరీ చేశారు. లహరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంలో మహిళకు సహకరించిన బస్సు కండక్టర్ మరియు డ్రైవర్ అన్నలకి నెటిజన్లు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. హ్యాట్సాఫ్ అంటూ వారిని మెచ్చుకుంటున్నారు. మరి పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళని సమయానికి ఆసుపత్రిలో చేర్పించిన ఆర్టీసీ డ్రైవర్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.