టీఎస్‌ఆర్టీసీ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. అప్పుల్లో కూరుకుపోయిన ప్రజారవాణా సంస్థ టీఎస్ఆర్టీసీపై డీజిల్ రూపంలో మరో పెనుభారం పడింది. రోజురోజుకీ పెరిగిపోతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ రోజూ కోట్లలో నష్టం చవిచూస్తోంది. దీంతో చార్జీలు పెంచక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గతంలో వ్యాఖ్యానించారు. ఇవాళ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
ఖైరతాబాద్ రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై సమావేశం అయింది. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే అధికారులు చార్జీల పెంపుపై ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వాస్తవానికి ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా.. కొన్ని రాజకీయ కారణాలతో నెల రోజులుగా ఈ కసరత్తు పెండింగులో పడింది. రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె తర్వాత 2019 డిసెంబరులో ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను సవరించింది. అప్పట్లో కిలోమీటరుకు 20 పైసల మేర పెంచింది.
పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్ కు 25 పైసలు. ఎక్స్ ప్రెస్ ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచాలని యోచిస్తున్నారు. సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తరువాత అధికారికంగా ప్రకటించనుంది ఆర్టీసీ యాజమాన్యం. సీఎం కేసీఆర్ ఓకే అన్న తర్వాత చార్జీలను పెంచనున్నారు.