టాలీవుడ్‌లో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసు 2017 నుంచి ఇప్పటి వరకు విచారణ జరుగుతూనే ఉంది. శనివారం దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్‌లకు ఎఫ్‌ఎస్‌ఎల్ డ్రగ్స్ వాడలేదని క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. డ్రగ్స్ కేసు నుంచి హీరో దగ్గుబాటి రానా, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌ను తప్పించేందుకు ప్రయత్నించింది ఎవరని ప్రశ్నించారు. బెంగుళూరులో డ్రగ్స్ విచారణ జరుగుతుంటే.. ఇక్కడి టీఆర్‌ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని అన్నారు.
సర్కార్ నిర్లక్ష్యంతోనే స్కూళ్లలో, కాలేజీల్లో, పబ్‌లలో డ్రగ్స్ విచ్చల విడిగా లభిస్తున్నాయని ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం అమరవీరుల స్థూపం వద్దకు వైట్ చాలెంజ్‌లో భాగంగా అక్కడికి వస్తా అన్నారు. రానా, రకుల్‌కు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇవ్వాలి కానీ ఈడీ విచారిస్తుందని, దాని వెనుకున్న రహస్యమేంటని అన్నారు. గజ్వేల్ సభ విజయవంతం కావడంతో కేటీఆర్ బయటికొచ్చి మాట్లాడుతున్నారని అన్నారు. గుంటూరు, పూణే, అమెరికాలలో చదువుకున్న కేటీఆర్‌కు తెలంగాణ సంస్కృతి ఏం తెలుసుందని ఎద్దేవా చేశారు.