టీఎస్పీఎస్సీ ఏఈ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రవీణ్ కు తెలియకుండా రేణుక చాలా కథ నడిపినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. అభ్యర్థులను ఇంటికి రప్పించుకుని మరీ వారిని.. ?
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజశేఖర్, ప్రవీణ్, రేణుకలను విడివిడిగా విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రాజశేఖర్ కంప్యూటర్ల పాస్ వర్డ్ లు తెలుసుకుని వాటిలో ప్రశ్నాపత్రాలను కాపీ చేసి ప్రవీణ్ కు ఇచ్చేవాడు. ప్రవీణ్ ఆ ప్రశ్నాపత్రాలను రేణుకకు ఇచ్చి మిగతా కథ నడపమనేవాడు. తన దగ్గర ప్రశ్నాపత్రాలు ఉన్నాయని ఆకర్షించి డీల్ మాట్లాడమని సూచించాడు. అలా ఒక్కో పేపర్ కు 10 నుంచి 20 లక్షల వరకూ డీల్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో రేణుక పలువురు అభ్యర్థులతో డీల్ కుదుర్చుకుని ప్రశ్నాపత్రాలు ఇచ్చి తన ఇంట్లోనే ప్రిపేర్ చేయించి మరీ పరీక్షలు రాయించేది. ఈ వ్యవహారంలో కొన్ని డీలింగ్స్ ప్రవీణ్ కు తెలిసి చేసినవి అయితే.. కొన్ని ప్రవీణ్ కు తెలియకుండానే చేసిందని విచారణలో వెల్లడైంది. ప్రవీణ్ కు తెలియకుండా మరిన్ని డీలింగ్స్ చేసినట్టు. నిందితుల వాట్సాప్ చాట్ డేటాను రిట్రీవ్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ డేటాతో కొత్త లింకులు కూడా బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఏఈ పరీక్ష పేపర్లు లీకైనట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్ ఈ లీకేజ్ కి పాల్పడగా.. ప్రధాన నిందితులుగా రేణుక, ఆమె భర్త ఉన్నట్లు తేలింది. టీఎస్పీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ప్రవీణ్, రేణుక మధ్య సన్నిహత సంబంధాలు ఏర్పడ్డాయి.
అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షలకు సంబంధించిన పేపర్లను రాజశేఖర్ నుంచి ప్రవీణ్ కు.. అక్కడ నుంచి రేణుకకు వచ్చాయి. ఆ తర్వాత డీల్ మాట్లాడుకునేది. అయితే ప్రవీణ్ కు తెలియకుండా రహస్యంగా మరిన్ని డీలింగ్స్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. కాగా ఈ ఏడాదిలో రేణుక ఇప్పటివరకూ మొత్తం 11 సెలవులు పెట్టింది. ఈ నెల 4వ తేదీన సెలవు తీసుకుంది. ఆ తర్వాత బంధువులు చనిపోయారని చెప్పి 10 నుంచి ఇప్పటివరకూ లీవ్ లో ఉందని తోటి ఉపాధ్యాయులు చెబుతున్నారు. గ్రూప్-1 పరీక్ష గత ఏడాది అక్టోబర్ 16న జరగగా.. నవంబర్ లో 12 రోజులు మాత్రమే వెళ్లినట్లు తెలుస్తోంది. 14 రోజులు మెడికల్ లీవ్ పెట్టినట్లు రికార్డుల్లో ఉంది. మొత్తానికి ఈ లీకేజ్ వ్యవహారంలో రేణుక పాత్ర పెద్దదే అని తెలుస్తోంది. రేణుక ప్రశ్నాపత్రాలను ఎంతమందికి ఇచ్చింది? ఆమె జరిపిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.