ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ కి కారణం ఒక వ్యక్తి అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
దేశంలో వరుస రైలు ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత నెలలో ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వందల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే మరొక ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణలోని ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే సమయస్ఫూర్తిగా ట్రైన్ గొలుసు లాగడంతో భారీ ప్రమాదం తప్పింది. గొలుసు లాగకపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు.
హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఉదయం 11 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాలిపోయిన బోగీలు ఎక్కువ మంది విశాఖపట్నంకి చెందిన వారు ఉన్నారు. ఈ ఘటనతో రైలు యాదాద్రి జిల్లా బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య రైలు నిలిచిపోయింది. ఎస్ 4 బోగీలో ముందు మంటలు అంటుకున్నాయని.. ఆ తర్వాత పక్క బోగీలకు వ్యాపించాయని చూసిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం పగటి పూట జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రాత్రి జరిగి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని అంటున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం రైలు బోగీలో ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఒక వ్యక్తి సిగరెట్ తాగడమే అని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు.
రైలులో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్ అనేది ఉంటుంది. బస్సుల్లోనూ, రైళ్లలోనూ ఛార్జింగ్ పాయింట్లు అనేవి కామన్ గా ఉంటున్నాయి. అయితే ఛార్జింగ్ పెట్టుకునే చోట సిగరెట్ తాగడం వల్ల ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. రైలులో మందు, సిగరెట్, గ్యాస్ సిలిండర్, పెట్రోల్ వంటి ప్రమాదకర వస్తువులను తీసుకురానివ్వరు. ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకురానివ్వరు. బహిరంగ ప్రదేశాల్లో, వాహనాల్లో సిగరెట్ తాగడం అనేది నేరం. ఛార్జింగ్ పాయింట్ దగ్గర సిగరెట్ తాగిన వ్యక్తికి తాగకూడదన్న ఇంగితం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీని వెనుక విద్రోహ చర్య ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. మూడు రోజుల క్రితం దక్షిణ మధ్య రైల్వేకి ఒక బెదిరింపు లేఖ వచ్చింది. ఒడిశా రైలు ప్రమాద ఘటన తరహాలోనే మరొక రైలు ప్రమాదాన్ని సృష్టిస్తామని బెదిరిస్తూ ఒక లేఖ రాశారు. హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో రైళ్లు ఒకదానికొకటి ఢీ కొనేలా చేస్తామని లేఖలో పేర్కొన్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే.. తెలంగాణ పోలీసులకు సమాచారాన్ని అందించింది. అయితే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు వెనుక బెదిరింపు లేఖ రాసిన వారి హస్తం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో ఢీ కొనేలా చేస్తామని చెప్పడం వెనుక డైవర్షన్ ఉందా? లేక వీరు వేరేనా? ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం వెనుక వేరే ఎవరిదైనా హస్తం ఉందా? అసలు ఫలక్ నుమా రైలు ఘటన ప్రమాదమా? లేక విద్రోహ చర్యనా? అనే విషయం మీద స్పష్టత రావాల్సి ఉంది.