ఐదేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. తండ్రి బాధ్యతలు కూడా తన భుజాన వేసుకుని ఆ తల్లి పిల్లలను పెంచుతూ వచ్చింది. ఇవాళ ఆ తల్లి కూడా ఆ పిల్లలను అనాథలను చేసి వెళ్ళిపోయింది. స్కూటీ పార్క్ చేసే సమయంలో వెనుక నుంచి రెడీ మిక్స్ లారీ వచ్చి ఢీకొనడంతో ఆ తల్లి మరణించింది.
రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడం అంటే ఆ వ్యక్తి రోడ్డు మీద పడిపోవడం మాత్రమే కాదు.. ఆ వ్యక్తి కుటుంబం రోడ్డున పడడం. కానీ కుటుంబ పెద్దలే లేకపోతే ఇక ఆ కుటుంబంలో పిల్లల పరిస్థితి ఏంటి? రోడ్డు ప్రమాదంలో ఒక టీచర్ మృతి చెందింది. హెల్మెట్ కూడా ఆమె ప్రాణాలను కాపాడలేకపోయింది. కరీంనగర్ లోని అల్కాపురి కాలనీకి చెందిన బండ రజిత.. ఇల్లంతకుంట మండలంలోని మోడల్ స్కూల్లో టీచర్ గా పని చేసేది. అయితే ఇవాళ ఉదయం ఆమె తన స్కూటీపై పద్మనగర్ లోని బైపాస్ రోడ్డు వైపుగా వెళ్ళింది. బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద స్కూటీని నిలిపే సమయంలో వెనక నుంచి వేగంతో వస్తున్న రెడీ మిక్స్ లారీ ఢీ కొట్టింది.
దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో స్కూటీ నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాద సమయంలో ఆమె తలకు హెల్మెట్ ఉన్నా కూడా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రజిత స్వగ్రామం శంకరపట్నం మండలం గద్దపాక గ్రామం. ఈమె భర్త.. బోయినిపల్లి వినోద్ కుమార్. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఐదేళ్ల క్రితం గుండెపోటుతో భర్త మరణించగా.. ఇప్పుడు రజిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో పిల్లలు అనాథలయ్యారని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.