కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు ఉంటున్నాయని.. నిత్యం వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని.. వైద్య సిబ్బంది కంటికి రెప్పలా చూసుకుంటారని ప్రభుత్వం చెబుతుంది. కానీ సరైన వసతులు లేక సిబ్బంది కొరత కారణంగా పేదలకు వైద్యం అందడం లేదన్న విమర్శలు వస్తునే ఉన్నాయి. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే..
వరంగల్ లోని ఎంజీఎంలోని ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి కిడ్నీ, లీవర్ చెడిపోవడంతో ఎంజీఎం ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ వేలుని ఎలుకలు వచ్చి కొరకడంతో తీవ్ర రక్తస్రావం జరగడంతో అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. వైద్యులు మళ్లీ కట్టుకట్టినా.. ఎలుకల భయంతో రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేయగా.. త్వరలోనే ఎలుకల బెడదను తొలగిస్తామని హామీ ఇచ్చారు.
ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై రోగులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ రోగిని ఎలుకలు కొరికేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కాగా, ఈ ఘటన పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.. బాధ్యులపై కఠిన చర్యల తీసుకుంటామని హామీ ఇచ్చారు.